Monday, September 18, 2006

నిజాంను చంపాలనుకున్నాం... - నారాయణరావు పవార్‌

రోజూలాగే నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ సవారీ రాజప్రాసాదం ‘కింగ్‌కోఠీ’ నుంచి బయలుదేరింది. కారు ఆల్‌ సెయింట్స్‌ స్కూలు దగ్గరికి ్‌వచ్చిందో లేదో... అంతదాకా ఏమీ ఎరగనట్టు రోడ్డు పక్కని గుంపులో నిలుచున్న ఒక ఇరవైళ్ళ యువకుడు తన పొడవాటి షేర్వాణీ జేబులోంచి బాంబు తీసి నిజాం కారు మీదికి బలంగా విసిరేశాడు. అయితే ఈ సారి మాత్రం అదృష్టం ఉస్మాన్‌ అలీఖాన్‌ పక్షాన ఉంది. నేరుగా యమపురికి పంపటానికి దూసుకువచ్చిన శక్తివంతమైన ఆ బాంబు కారు కిటికీ అద్దానికి తగిలి ఇవతలికి పడి రోడ్డు మీదే చెవులు చిల్లులు పడే శబ్దంతో పేలిపోయింది. బాంబు శకలాలు చెల్లా చెదరుగా పడ్డాయి. అక్కడ దట్టమైన పొగ అలుముకుంది. ఇద్దరికి గాయాలయ్యాయి. హాహాకారాలు మిన్నంటాయి. నిజాం మాత్రం వెంట్రుక వాసిలో తప్పించుకున్నాడు. బతుకు జీవుడా అనుకుంటూ ఆదరాబాదరాగా ఇంటి ముఖం పట్టాడు!

ఇంకో బాంబు తీసి వేయబోతూండగా ఆ సాహసిక యువకుడిని పోలీసులు చుట్టుముట్టారు. కిరాతకంగా నెత్తురు కారేట్టు కొట్టారు. చిత్రహింసలు పెట్టారు. అయినా ఆ యువకుడు నోరు విప్పలేదు. 1947 డిసెంబర్‌ 4 నాటి రాత్రి ఎనిమిది గంటలకి హైదరాబాద్‌ రేడియో ‘అల్లా దయ వల్ల నిజాం ప్రభువులు క్షేమంగా ఉన్నారు’ అంటూ ప్రత్యేక వార్తను ప్రసారం చేసింది. ప్రజాకంటకుడైన నిజాంను నిర్జించటం కోసమే బాంబు వేశాననీ తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించాననీ ఆ యువకుడు కోర్టు ఎదుట సగర్వంగా ప్రకటించాడు. ఇంతకీ ప్రాణాలకు సైతం తెగించిన ఆ యువకుడు ఎవరు? వీర సావర్కార్‌ వజ్ర సంకల్పమూ రామ్‌ప్రసాద్‌ బిస్మిల్‌ వీరావేశమూ మదన్‌లాల్‌ ధీంగ్రా నిరుపమ సాహసమూ ఖుదీరాంబోస్‌ సర్వసమర్పణ భావమూ.... ఈ అన్నీ కలిసి ‘నారాయణరావు పవార్‌ ’ కాక ఇంకేమవుతాయి?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ఆర్య ప్రతినిధి సభ పుస్తకాధ్యక్షుడిగా ఉన్న నారాయణరావు పవార్‌ ఒకనాడు నియంత నిజాంకు సింహస్వప్నం. నిజాంను తుదముట్టించేందుకు బాంబు వేసిన ‘నేరానికి’ (కింగ్‌కోఠీ బాంబు కేసు 1947) ఆయనకు ‘ఉరి’ శిక్ష పడింది. పోలీసు చర్య గనక పది రోజులు ఆలస్యమైవుంటే నారాయణరావు మనకు దక్కివుండేవారు కాదు. అయితే ఇంత త్యాగ ధనుడికీ స్వాతంత్య్ర వీరుడికీ ప్రభుత్వం ఇచ్చిన బహుమానం ఏమిటంటే... పోలీసు చర్య తర్వాత కూడా ఒకటి కాదు రెండుకాదు - పదకొండు నెలల పాటు జైల్లోనే బందీని చేసి హింసించటం! ్‌‘ప్రజాప్రభుత్వం’ వచ్చిన రెండేళ్ళదాకా ఏ ఉద్యోగమూ రానివ్వకుండా పేరును ంౌడీ షీటర్లకి మల్లే బ్లాక్‌ ల్‌ిస్ట్‌లో ఉంచటం! అన్నిటికన్నా లజ్జాకరమైన సంగతి ఏమిటంటే, తనని కనీసం ‘రాజకీయ ఖైదీ’గా అయినా గుర్తించమని భారత ప్రభుత్వాన్ని కోరుతూ ఆయన పందొమ్మిది రోజుల పాటు నిరాహార దీక్ష చేయవలసి రావటం. ఇంకా హేయమైన విషయమేమిటంటే జైలు నుంచి విడుదలకు ‘మాఫినామా’ (క్షమాపణ పత్రం) రాసివ్వమని మన ప్రభుత్వమే నారాయణరావుని అడగటం! అట్లా ఎన్ని ఒత్తిడులు వచ్చినా తలవంచని ధీరోదాత్తుడిని చివరికి ప్రజల ఒత్తిడికి తలవంచి ప్రభుత్వం బేషరతుగా విడుదల చేసింది.

1926 అక్టోబర్‌ మూడున వరంగల్‌ పోతుగడ్డపై పుట్టిన నారాయణరావు పవార్‌ ఒక మామూలు రైల్వే హమాలీ బిడ్డ. స్వాతంత్య్ర లక్ష్మి పూరి గుడిసెల్లోనే పుట్టిందన్నమాట ఎంత నిజం. ఇప్పటికీ సామాజిక కార్యమగ్నులై, ఏడుపదులు దాటిన నారాయణరావు పవార్‌తో హైదరాబాద్‌ సంస్థాన విమోచనదిన (సెప్టెంబర్‌ 17) శుభావసరాన ముఖాముఖి...

ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఇవీ...

? భారత స్వాతంత్య్రసమరంలో భాగమైన హైదరాబాద్‌ విముక్తి పోరాట పూర్వరంగాన్ని గురించి చెప్పండి...

- ఆ రోజుల్లో నిజాం వ్యతిరేకపోరాటమే మాకు స్వాతంత్య్రోద్యమం. నిజాం ఆంగ్లేయుల తొత్తు. నిజాం పెత్తనాన్ని కూలదోయడమే మా దృష్టిలో స్వాతంత్య్ర సాధన. ఆనాడు రాష్ట్రంలో రాజకీయ ఉద్యమమేదీ ఉండేది కాదు. ఆర్యసమాజమే మొదటి సారిగా నిజాం సవాలును స్వీకరించింది. ఓం ధ్వజంపైనా సామూహిక హవనం పైనా నిషేధం ఉండేది. ఏ కార్యక్రమం చేయాలన్నా నిజాం అనుమతి తప్పనిసరి! అందుకే పౌరహక్కుల కోసం 1939 అక్టోబర్‌ 15 నుంచి ఆర్యసమాజం ఉద్యమాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత సార్వదేశిక్‌ ఆర్యప్రతినిధిసభ రంగం లోకి వచ్చింది. అప్పటి నుంచీ ఉద్యమం జాతీయ ్‌స్థాయిలో సాగింది. ఇది ్‌ప్రారంభమైంది 1939 జనవరి 31 నుంచి. ఆర్యసమాజ ప్రచారంపై నిషేధాన్ని ఎత్తివేయాలనీ ఉర్దూయేతర భాషల మాధ్యమంతో అంటే కన్నడ, తెలుగు, మరాఠీ మీడియాలలో పాఠశాలలు నడిపించేందుకు అనుమతి ఇవ్వాలనీ రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనీ కోరుతూ ఈ ఉద్యమం నడిచింది. మొత్తం పన్నెండు వేల మంది ఈ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. చివరికి నిజాం ప్రభుత్వం దిగి వచ్చింది. ఆర్యసమాజం డిమాండ్లన్నిటికీ ప్రభుత్వం ఒప్పుకుంది. ఆనాడు కమ్యూనిస్టులైనా కాంగ్రెస్‌వారైనా అందరికీ ఆర్యసమాజమే వేదిక అయ్యింది.

? నిజాం వ్యతిరేకోద్యమంలో మీరు చారిత్రక భూమికను నిర్వహించారు. ఆనాటి మీ స్ఫూర్తివంతమైన పోరాటం గురించి వివరంగా చెబుతారా? మీ వ్యక్తిగత జీవితంతో సహా...

- నేను వరంగల్‌ లో పుట్టాను. మా కుటుంబం ఎప్పుడో కరువు మూలాన జరుగుబాటు లేక తొంభై ఏళ్ళ కిందట మహారాష్ట్ర నుంచి ఇక్కడికి తరలి వచ్చింది. మా తండ్రిగారు పండరీనాథ్‌గారు వరంగల్‌లోనే రైల్వే హమాలీగా కుదురుకున్నారు. నేను ఏడో క్లాసు దాకా మఠ్వారా ఇంగ్లీష్‌్‌ స్కూల్లో చదివాను. 8, 9, 10 క్లాసులనూ ఇంటర్మీడియట్‌ కోర్సునూ హన్మకొండలో చదివాను. ఎనిమిదో క్లాసు నుంచే నాకు ఆర్యసమాజంతో పరిచయం కలిగింది. ఇంటర్‌ తర్వాత ‘లా’ క్లాసు చదవటానికి నేను హైదరాబాద్‌ వచ్చాను. అవి హైదరాబాద్‌ విముక్తి పోరాటం ఉద్ధృతంగా సాగుతూన్న రోజులు. ఆ పరిస్థితుల్లో 1946 జూన్‌ 16 నాడు నిజాం ఒక ఫర్మానా జారీ చేశాడు. బ్రిటిష్‌ హుకుమత్‌ (శాసనాధికారం) పోతే హైదరాబాద్‌ సర్వసత్తాక ర్‌ాజ్యంగా ఉంటుందే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ భారత యూనియన్‌లో చేరబోదన్నది ఆ ఫర్మానా సారాంశం. అప్పటికే బహదూర్‌ యార్జంగ్‌లాంటి వాళ్ల చేతుల్లో హిందువులు నానా యాతనలు పడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో 1947 లో వచ్చిన ఒక చట్టం నిజాంకు వరంగా పరిణమించింది. భారత సంస్థానాలు పాకిస్థాన్‌లోనైనా కలవొచ్చు - భారత్‌లోనైనా కలవొచ్చు - లేదా స్వతంత్రంగానైనా ఉండొచ్చు - ఇదీ ఆ చట్టం. ఈ చట్టం ప్రకారం నేను సర్వస్వతంత్రుడిని అన్నాడు నిజాం. కానీ ఇక్కడి జనత మాత్రం ప్రజా రాజ్యమే కావాలంది. నెహ్రూగారేమో హైదరాబాద్‌ ప్రజలే వారి ఉనికి గురించి తేల్చుకోవాలన్నారు. ఇక సంఘర్షణ అనివార్యం అయ్యింది. ప్రజా నాయకులందర్నీ ప్రభుత్వం జైళ్ళలోకి నెట్టింది. ఆ రోజుల్లో మేం ఎనిమిది మందిమి ఒక అజ్ఞాతం దళంగా పని చేస్తూ ఉండేవాళ్ళం. అంతా ఆర్యసమాజీయులమే. నేనూ, బాల్‌కిషన్‌, పండిత్‌ విశ్వనాథం, రెడ్డి పోచనాధం, గంగారాం, జగదీశ్‌, జి.నారాయణస్వామి ఇందులో సభ్యులం. కొండాలక్ష్మణ్‌ బాపూజీ కూడా మాకు సహకరించారు.

మేమంతా హైదరాబాద్‌లోని కొల్సావాడి దగ్గరి బాలకిషన్‌ ఇంట్లో బైఠక్‌ చేసుకునేవాళ్ళం. అక్కడే దేశ స్థితిగతులపై చర్చలు జరిగేవి. ఒకరోజు దారుస్సలాంలో మహ్మదాలీ జిన్నా ప్రసంగించాడు. అది కేవలం హిందువులపై విషవమనం. ఆ ప్రసంగం విన్న మాకు రక్తం మరిగిపోయింది. ఈ నిజాం రాజ్యాన్ని తుదముట్టించ్‌ేందుకు చివరి శ్వాస దాకా పోరాడాలని ఆనాడే మేం ప్రతిజ్ఞ చేశాం. ఆ రోజుల్లోనే నిజాం రాష్ట్రానికి ‘మహజరీన్‌ ’ల రాక మొదలైంది. హైదరాబాద్‌ రాష్ట్రాన్ని ముస్లిం జనబాహుళ్య రాజ్యం చేయటం కోసం ఎక్కడెక్కడి ముస్లింలూ ఇక్కడికి రాసాగారు.

నిజామూ రజాకార్లు వేసిన ఎత్తుగడ ఇది. అ్‌ట్లా వచ్చిన వారికి ఎర్రగడ్డ, మౌలాలీల దగ్గర శిబిరాలూ ఏర్పాటయ్యాయి. మొత్తం ఆ రోజుల్లోనే 12 లక్షల మంది ఇలా వలస వచ్చారు. మాకు ఒళ్ళు మండిపోయింది. ఇట్లా ‘మహజరీన్ల’ను తీసుకువచ్చే ప్రత్యేకరైలును పడేద్దామని ప్రయత్నించాం ఘట్‌కేసర్‌ - మౌలాలీల నడుమ పట్టాల బోల్టులు విప్పదీసేశాం. కానీ ఒక గ్యాంగ్‌మన్‌ కంటపడడంతో రైలు ఆగిపోయింది. ఆ తర్వాత మూసీ నది ఒడ్డున వున్న రిజర్వ్‌పోలీస్‌ గుర్రాల కొట్టాంలో టైంబాంబ్‌ పెట్టాం. అది పేలింది. దాంతో పహారా ఎక్కువైంది. ఈ పరిస్థితుల్లో ఏకంగా నిజాంనే ఖతం చేస్తే... అన్న ఆలోచన వచ్చింది మాకు.

అదే జరిగితే నిజాం రాష్ట్రంలో అంతర్యుద్ధం తప్పదనీ పరిణామంగా భారత ప్రభుత్వం కలగజేసుకుంటుందనీ మేము అంచనా వేశాం. ఇక నిజాంను చంపటం కోసం ఆయుధాల సేకరణ మొదలైంది. షోలాపూర్‌కీ బొంబాయికీ వెళ్ళి నేనూ విశ్వనాథం 600 రూపాయలు ఖర్చు చేసి మూడు అమెరికన్‌ మిలెటరీ చేతి బాంబులనూ రెండు రివాల్వర్లనూ (దొరికితే ఆత్మహత్య చేసుకోవడానికి) మూడు విషం సీసాలను తీసుకువచ్చాం. మాతృభూమిని విముక్తం చేయాలన్నదే మా ఆరాటం. దానికి మేం ఏ మూల్యమైనా చెల్లించటానికి సిద్ధంగా ఉన్నాం. మాది ఆత్మాహుతి దళం. క్రాంతికారి తన శిరసును తన చేతుల్లో ఉంచుకుని ముందుకు సాగుతాడు. ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే అతడు తన సంకల్పం నుంచి ఎన్నటికీ విచలితుడు కాడు. ఆ రోజుల్లో నేతాజీ ప్రసంగాలు మమ్మల్ని బాగా ఉత్తేజితుల్ని చేశాయి.

నిజాంను మట్టుబెట్టటానికి 1947 డిసెంబర్‌ 4న ముహూర్తాన్ని నిశ్చయించాం. ఎందుకు నిజాంను చప్పాల్పి వచ్చిందో వివరంగా రాసి ఆ వాజ్ఞ్మూలంపై నేనూ, జగదీశ్‌, గంగారాం మా రక్తంతో సంతకాలు చేశాం. ఆ ్‌ప్రకటనను బాలకిషన్‌కి ఇచ్చి బొంబాయి పంపించివేశాం. విశ్వనాథ్‌ను విజయవాడ పొమ్మన్నాం. ఇదంతా ఎవరూ పట్టుబడకుండా ఉండేందుకు. కింగ్‌కోఠీ నుంచి రోజూ సాయంత్రం చార్మినార్‌కి పోయి అక్కడ నమాజు చేసుకుని దారుషఫా వెళ్లి తన తల్లి సమాధిని చూసుకుని వచ్చే అలవాటు నిజాం కు ఉండేది. దాన్ని మేం ఉపయోగించదలుచుకున్నాం. సాయంత్రం 5 గంటలకి కింగ్‌కోఠీ నుంచి బయలుదేరగానే ఆల్‌సెయింట్స్‌ స్కూలు దగ్గర నేను బాంబు వేయాలన్నది పథకం. నా సహచరుల్లో జగదీశ్‌ బొగ్గుల కుంట దగ్గరా, గంగారాం మడిస్ట్‌ స్కూలు దగ్గరా కాపు వేసి ఉండాలి. నా దాడి గనక విఫలమైతే ఒకరి తర్వాత ఒకరుగా జగదీశ్‌, గంగారాం నిజాంపై హత్యాయత్నం చేయాలి. నా దగ్గర రెండు బాంబులు పెట్టుకున్నాను. జగదీశ్‌ దగ్గర ఒక బాంబూ ఒక రివాల్వరూ, గంగారాం దగ్గర ఒక బాంబూ ఒక రివాల్వరూ ఉన్నాయి. అందరి దగ్గరా విషం సీసాలు సిద్ధం.

అనుకున్నట్టుగానే నిజాం కారు బయలుదేరింది. గంగారాం తీసుకువచ్చిన సైకిల్‌ పై వచ్చిన నేను దాన్ని ఒక పక్కన నిలిపి కారు కోసం ఎదురుచూస్తూ నిలుచున్నాను. కారు కనబడగానే నేను చప్పున కదిలాను. షేక్‌హూసేన్‌ అనే ఒక కానిస్టేబుల్‌ నన్ను ఆపటానికి ప్రయత్నించాడు. అయితే కారు పది అడుగుల దూరంలో ఉండగా నేను నా జేబులోంచి బాంబు తీసి విసిరాను. అయితే ్‌ అది కారు అద్దానికి తగిలి బయటికే పడి రోడ్డు మీదే పేలింది. కారు అద్దాలు పగిలిపోయాయి. అంతా కకావికలయ్యారు. రెండో బాంబు తీసి వేద్దామని ప్రయత్నిస్తుండగానే షేక్‌హుసేన్‌ వచ్చి నా చేయి పట్టేసుకున్నాడు. ఇంతలో డ్రైవర్‌ కారును మళ్ళించివేగంగా నిజాంను తీసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. దీంతో నా ఇద్దరు సహచరులకు అవకాశం చిక్కలేదు. వారు దాడి సఫలమై ఉంటుందనుకుని వెళ్లిపోయారు. ఈ దాడిని చూసి ఒక చావూస్‌ బల్లెంతో వచ్చి నన్ను పొడవబోయాడు. అయితే ఎస్‌.ఐ. జోసెఫ్‌ అడ్డుకున్నాడు. ఇంటరాగేట్‌ చేశాక చంపేయవచ్చునని నచ్చజెప్పాడు.

అక్కడ నన్ను విపరీతంగా కొట్టారు. నా పళ్లు చాలా ఊడిపోయాయి. రక్తంతో నా బట్టలన్నీ తడిసిపోయాయి. నన్ను అట్లా కొట్టుకుంటూ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్ళారు. అప్పుడు చూశాను నేను, కింగ్‌కోఠీ వరండాలో వణుకుతూ నిలుచున్న నిజాంను! పోలీస్‌స్టేషన్‌లో నా పేరు ‘బాబు’ అని చెప్పాను. నేను హిందువునో ముస్లిమునో తెలుసుకునేందుకు నా ప్యాంట్‌ విప్పి చూశారు. సుంతీ లేకపోవటంతో నేను హిందువునే అని తేల్చుకున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో బహదూర్‌ యార్జంగ్‌ కూడా నిజాంకు శత్రువయి ఉన్నాడు. అతడైనా నిజాంపైన దాడి చేయించే అవకాశం ఉందని వారు తలచారు. ఇంతలో నిజాం ప్రైమ్‌మినిష్టర్‌ లాయకలీ వచ్చాడు. నువ్వు మొహజిర్‌ వా అనడిగాడు. ఆ తర్వాత ఏసీపి ఫజలే రసూల్‌ఖాన్‌ వచ్చి నన్ను పోలీసు కమిషనర్‌ ఆఫీసుకు తీసుకుపోయాడు.

అక్కడ నన్ను లాకప్‌లో పడేశారు. నా వెనక ఎవరెవరు ఉన్నారో చెప్పమని నన్ను లాఠీలతో కొట్టారు. నా కీళ్ళపై మోదారు. నేను నోరు విప్పలేదు. డిసెంబర్‌ 18 వరకూ టార్చర్‌ చేశారు. ఈ లోపు హత్యాయత్న స్థలం దగ్గర వదిలేసిన సైకిల్‌ (ఎస్‌.కె.10) ఆధారంగా గంగారాం కూడా పట్టుబడ్డాడు. మొత్తం 15 రోజుల పాటు 200 మందిని ఇంటరాగేట్‌ చేశారు. మమ్మల్ని చంచల్‌గుడ జైలుకు తరలించారు. 1947 డిసెంబర్‌ 19 నుంచీ 1948 మార్చి 26 వరకూ జుడీషియల్‌ కస్టడీ.

బషీరుద్దీన్‌ అనే ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట మొదట విచారణ సాగింది. నిజాం అనేవాడు పెద్ద దేశ ద్రోహి కాబట్టే చంపాలనుకున్నామని ప్రకటించాం. 35 మందిని సాక్షుల్ని మేజిస్ట్రేట్‌ విచారించాడు. నా మీద సెక్షన్‌ 78 పెట్టారు. ‘అసఫియా పీనల్‌ కోడ్‌’ ప్రకారం అది ‘రాజుకు వ్యతిరేకంగా పోరాటం నడిపే నేరం’. దానికి శిక్ష మరణమే కాబట్టి కేసు సెషన్స్‌ కోర్టుకు బదిలీ అయింది. మా కోసం రాంలాల్‌ కిషన్‌ అనే న్యాయవాదిని ప్రభుత్వమే నియమించింది. రైతుల ధాన్యంపై ఎక్కువ లేవీని వసూలు చేస్తున్నారన్న విషయాన్ని నిజాం దృష్టికి తేవడానికి మాత్రమే దాడి చేశానని చెప్పమన్నాడు, ఆ న్యాయవాది. అయితే నేను ఒప్పుకోలేదు. అసలు న్యాయవాదే వద్దన్నాను. చివరికి 1948 మార్చి 27 నాకు ఉరిశిక్ష పడింది. నా సహచరుడు గంగారాంకు యావజ్జీవ కారాగారవాసం విధించారు. ఈ శిక్షలను హైకోర్టూ, ఆ తర్వాత జ్యుడిషియల్‌ కమిటీ కూడా ధ్రువీకరించాయి. అంతలో దైవికంగా పోలీసు చర్య ప్రారంభమైంది. అది సెప్టెంబరు 13. సెప్టెంబరు 17 నాటికి హైదరాబాద్‌ రాష్ట్రం విముక్తమైంది.

కానీ మేము విడుదల అవడానికి ఇంకో 11 నెలలు పట్టింది! నిజాంని రాజ్‌ప్రముఖ్‌ చేయడమే దీనికి కారణం. ఇది కేవలం బుజ్జగింపు ధోరణి. కానీ జనం మా వెంట ఉన్నారు. మా విడుదల కోసం హర్తాళ్లు జరిగాయి. మా తండ్రిగారు వల్ల భభాయి పటేల్‌ వద్దకు వెళ్లారు. వెంటనే పటేల్‌ మిలటరీ గవర్నర్‌ జె.ఎన్‌. చౌదరిని పిలిచి మమ్మల్ని విడుదల చేయమని ఆదేశించాడు. కానీ ప్రభుత్వం మా పట్ల అన్యాయంగా ప్రవర్తించింది. మేము మాఫీనామా రాసిస్తేనే విడుదల చేస్తామంది. దీనికి మేము ఒప్పుకోలేదు. చివరికి మేము రాజకీయంగా ఖైదీలుగా గుర్తింపబడడం కోసం కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సి వచ్చింది.. ఆఖరుకు మా డిమాండ్‌ను ఒప్పుకున్నారు. అప్పటిదాకా మా శరీరాలపై ఇంకా గొలుసులు అట్లాగే వేళ్లాడుతూ ఉండేవి. మాకు ఖైదీల యూనిఫామే ఉండేది. మాఫీనామా ఇవ్వడానికి మేము ఒప్పుకోకపోయేసరికి ఏం చేయాలో ప్రభుత్వానికి తోచలేదు. అవతల ప్రజల ఒత్తిడేమో పెరుగుతోంది. చివరికి దిగివచ్చిన ప్రభుత్వం బేషరతుగా మమ్మలిద్దర్నీ 1949 ఆగస్టు 10న వదిలిపెట్టింది. అయితే రెండేళ్లదాకా మా పేర్లు ‘బ్లాక్‌ లిస్టు’లో ఉండేవి. మమల్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం క్రిమినల్స్‌గానే పరిగణించింది. ఈ కారణంగా ఒకసారి నేను ఉద్యోగం నుండి తొలగించబడ్డాను కూడా.

? మీరు మాతృభూమి విముక్తి కోసం హింసా మార్గాన్ని ఎంచుకున్నారు కదా, ఇప్పుడు నక్సలైట్ల సాయుధ పోరాటాన్ని కూడా సమర్థిస్తారా..

- మేము గాంధీగారి అహింసను ఎన్నడూ విశ్వసించలేదు. ‘ఈట్‌కా జవాబ్‌ పత్తర్‌ సే హీ దేనా చాహియే’. మాది వైదిక హింస. (వైదికీ హింసా హింసానా భవతి). అది హింస కాదు రాముడు రావణుడిని చంపటమూ, కృష్ణుడు కంసుణ్ని చంపటమూ హింస కానట్టే మాదీ హింస కాదు. దేశం పరాధీనమై ఉన్నప్పుడు జాతీయశక్తులు సృష్టించే ‘టెర్రరిజం’ దుర్మార్గుల గుండెల్లో భీతిని కలగజేస్తుంది. అది జనతకు ధైర్యాన్నీ ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. అది పరిణతి అయ్యేది క్రాంతిలోనే. ఆ క్రాంతి నుంచి వస్తుంది స్వాతంత్య్రం. ఇక నక్సలైట్ల సంగతంటారా, వ్యవస్థను మార్చుకునేందుకు ఈనాడు బ్యాలెట్‌ మార్గం ఉంది. అది లేనందుకే మేమానాడు సాయుధ పోరాటం చేశాం. ఇప్పుడు చేయవలసింది యువతరంలో చైతన్యాన్ని నింపటం.

? అరవయ్యేళ్ల స్వాతంత్య్రంపై మీ వ్యాఖ్య ఏమిటి...

- ఈ స్వాతంత్య్రం పట్ల మాకు ఎంతమాత్రమూ సంతృప్తిలేదు. అవినీతి ఇవ్వాళ వ్‌ిచ్చలవిడిగా సాగుతోంది. నిరుద్యోగమూ దారిద్య్రమూ ఇంకా అట్లాగే ఉన్నాయి. ఇన్నేళ్లలో కనీసం మనం ఒక జాతీయ అనుసంధాన భాషను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోలేక పోయాం. ఇది నిజంగా విషాదం.

(ఇంటర్వ్యూ- స్వాతి)

No comments: