Monday, September 18, 2006

తెలంగాణ విమోచన - సిహెచ్‌. విద్యాసాగర్‌ రావు

వందేమాతర గీతాన్ని ఆలపించడానికి నిరాకరించిన ఉదంతం జాతి జీవనాన్ని కలచివేస్తుంది. వందసంవత్సరాల క్రితం స్వదేశీ, స్వజాతీ, స్వాతంత్య్ర ఉద్యమాల జ్వాలలను రగిల్చిన జాతీయ గేయంలోని ఆ చరణాలు తల్లి భారతికి ఆభరణాలు. కోట్లాది భారతీయులను ముందుకు నడిపించే కరదీపికలు! అలాంటి గీతానికి మతాల మకిలిని అంటించడం బాధ కలిగించింది. అదే విధంగా హైదరాబాద్‌ విమోచనోద్యమం ఫలించి విజయ కేతనాన్ని ఎగరవేసిన చరిత్రాత్మక రోజు 17 సెప్టెంబర్‌ 1948. భారతదేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు 1947 ఆగస్టు 15న స్వేచ్ఛావాయువులు పీల్చుకోగా, తెలంగాణ ప్రజలు స్వాతంత్య్రం కోసం ఇంకో ఏడాదికిపైగా ఎదురుచూడవలసి వచ్చింది. చివరికి సెప్టెంబర్‌ 17న భారత సైన్యం నిజాం మెడలువంచింది. ఈ విజయోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించకపోవడం కోట్లాది తెలంగాణ ప్రజల మనోభావాలను కించ పరచడమే అవుతుంది. గతంలో హైదరాబాద్‌ సంస్థానంలో ఉండి, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తరువాత, మహారాష్ట్రలో కలసిన 5 జిల్లాలు, కర్ణాటకలో కలసిన 3 జిల్లాలలో అక్కడి ప్రభుత్వాలు ప్రతియేటా సెప్టెంబర్‌ 17న విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం దీన్ని పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ తరువాత కూడా- మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు నిర్వహించినట్టుగా అధికారికంగా 17 సెప్టెంబర్‌ నాడు తెలంగాణ జిల్లాలలో విమోచన ఉత్సవాన్ని జరపడంలో ఎందుకు సందేహిస్తున్నారో అనే అంశం అందరినీ ఆలోచింపచేస్తుంది. బాధను కలిగిస్తుంది. ఇంతవరకు అధికారికంగా ఈ ఉత్సవాన్ని జరపక పోవడమే ఘోరతప్పిదం. దాన్ని సవరించడం ఆదర్శప్రాయమవుతుంది. కోట్లాది ప్రజల మనోభావాలను గౌరవించడమే కాకుండా భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అయితే ఈ విమోచన అనేది మస్లింలపైన హిందువుల విజయంగా పరిగణించి మ్‌ుస్లిం సోదరులు వ్యతిరేకిస్తారేమో అనే అనుమానాన్ని నర్మగర్భంగా తెలియజేస్తున్నది ప్రభుత్వం. వాస్తవానికి తెలంగాణ విమోచన దేశ స్వాతంత్య్ర పోరాట క్రమంలోనే కొనసాగిన వీరోచిత పోరాట ఫలితమని, ఎంతో మంది ముస్లిం సోదరులు ఇందుకోసం బలిదానం చేశారని గుర్తుంచుకోవాలి. తురేబాజ్‌ ఖాన్‌ (1857), షోయబుల్లా ఖాన్‌ (1948) లాంటి వారు తమ ప్రాణాలను త్యాగం చేసిన నిజాన్ని మనం మరువరాదు. నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అనేకమంది ముస్లిమ్‌లు పాల్గొన్నారు. కాబట్టి తెలంగాణ విమోచన ముస్లింలకు వ్యతిరేకమన్న తప్పుడు అభిప్రాయాన్ని ప్రభుత్వం తొలగించుకోవాలి. షోయబుల్లాఖాన్‌ లాంటి పత్రికా సంపాదకుని విగ్రహాన్ని మనం ప్రతిష్టాపన చేసుకోక పోవడం అవమానకరం అన్న సత్యాన్ని గ్రహించాలి. విమోచన దినోత్సవం జరుపుకోవడంపై కమ్యూనిస్టు సోదరులు ఖచ్చితంగా తమ అభిప్రాయాన్ని తెలియజేయకపోవచ్చు. ఎందుకంటే వారు 1951 వరకు భారతదేశంపైన తమ పోరాటాన్ని కొనసాగించారు. అయితే ఈ విమోచన దినాన్ని వారు వ్యతిరేకిస్తారని అనుకోవడం పొరపాటు. ఈ కుంటి సాకులన్నిటినీ ప్రభుత్వం తెరమీదకి తీసుకొనివచ్చి కాలయాపన చేస్తున్నది. ప్రత్యేక తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి, విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తే ప్రత్యేక తెలంగాణ వాదానికి బలం చేకూరుతుందేమోనన్న భయం ఆవరించి వుందనేది అసలు రహస్వమని బహిర్గతమౌతోంది. అయితే ఇది ఏ ప్రాంతవాసులకూ వ్యతిరేకం కాదనేది మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలు బహిర్గతం చేశారు. ఏది ఏమైనా ప్రభుత్వం వచ్చే సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినంగా ప్రకటించి, అధికారికంగా ఉత్సవాలను నిర్వహించాలని సర్వత్రా కోరుతున్నారు.

- సిహెచ్‌. విద్యాసాగర్‌ రావు
కేంద్ర మాజీ మంత్రి

2 comments:

rk blogs in said...

మన తెలంగానాంధ్ర లొల్లి హాలీవుడ్ ని కుడా తాకినట్టుంది…….ఇక్కడ చూడండి

http://dedicatedtocpbrown.wordpress.com/2010/03/03/%E0%B0%AE%E0%B0%A8-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%B2%E0%B1%8A%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%B9/

Nrahamthulla said...

నిజాంను వ్యతిరేకించిన వారిలో అనేక మంది ముస్లిం సోదరులు ఉన్నారు.తుర్రేబాజ్‌ ఖాన్ ‌, బందగి , షోయబుల్లాఖాన్‌ లాంటి అనేక మంది ముస్లింలు కూడా నిజాం నిరంకుశ పాలనలో హత్యచేయబడ్డారు.1946-48 సంవత్సరాల్లో బందగి హత్య నేపధ్యాన్ని ఇతివృత్తంగా తీసుకొని సుంకర , వాసిరెడ్డి లు మాభూమి నాటకాన్ని వ్రాసి ఊరూరా ప్రదర్శనలిచ్చారు.మా భూమి నాటకం షేక్ బందగీ సమాధి దగ్గర నిలబడి నివాళులర్పించటంతో ప్రారంభమయింది.1942లో షేక్ బందగీ ని విసునూరు రామచంద్రారెడ్డి గూండాలు హత్యచేశారు.దేవులపల్లి వెంకటేశ్వరరావు 1845లోనే ‘జనగామ ప్రజల వీరోచిత పోరాటాలు’ పుస్తకం లో బందగీ గురించి వివరంగా రాశారు.తిరునగరి రామాంజనేయులు వీరబందగి పేర బుర్రకథ వ్రాసి ప్రదర్శనలిచ్చారు
తెలంగాణాలోని ముస్లింలు 'విమోచన' అనే పదాన్ని వ్యతిరేకించినందువల్లఆఅసెప్టెంబర్ 17ను తెలంగాణ విలీనదినం'గా జరపాలని జేఏసీ నిర్ణయించింది.సెప్టెంబర్ 17ను విలీన దినోత్సవంగా ప్రజలు గుర్తించాలి. ఆరోజు తెలంగాణ వ్యాప్తంగా జాతీయజెండాలతో పాటు తెలంగాణ జెండాలను ఎగరేయాలి. జాతీయగీతాన్ని, తెలంగాణ గీతాన్ని ఆలపించాలి. తెలంగాణ ఉద్యమంలో అమరులైన వారిని సంస్మరించుకోవాలి' అని జేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపునిచ్చారు.