Sunday, September 17, 2006

'1969' పునరావృతమవుతుందా? -కట్టా శేఖర్‌రెడ్డి

తెలంగాణ ఉద్యమంలో తరచూ కొందరు '1969 పునరావృత్తం' గురించి మాట్లాడుతు న్నారు. ఆ ఉద్యమాన్ని దేనికి ప్రతీకగా పరిగణించి వారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారో తెలి యదు. భయపడేవారు, ఆందోళన పడేవారు మాత్రం ఆ ఉద్యమాన్ని హింసకు, విద్వేష పూరిత పరస్పర హననానికి ప్రతీకగా భావిస్తుంటారు. నిజానికి, ఆ ఉద్యమం కేవలం హింసకు ప్రతీక కాదు. అసలు ఆ ఉద్యమం దేనికి ప్రతీక? ఆ ఉద్యమం నుంచి నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి? 1969కి 2006కి ఉన్న పోలిక ఏమిటి? ఆ ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమకారులు నేర్చుకోవలసిందే ఎక్కువ. 1969 ఉద్యమం కనీవినీ ఎరుగని తెలంగాణ ప్రజల సంఘటిత శక్తి కి మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలు దారుణంగా వంచనకు గురికావడానికి కూడా ప్రతీక. ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ దాష్టీకానికి ప్రతీక. చెన్నారెడ్డి మోసానికి ప్రతీక. 350 మంది తెలంగాణ యువకుల బలిదానానికి ప్రతీక. సోదరుల వంటి తెలంగాణ, తెలంగాణేతర ప్రజల మధ్య రగిలిన విద్వేషాగ్నికి ప్రతీక. మొత్తంగా తెలంగాణ ప్రజల పరాజయానికి ప్రతీక. ఇందులో దేనిని పునరావృతం చేయాలనుకుంటున్నారు? తెలంగాణ ఉద్యమకారులు తెలిసే మాట్లాడుతున్నారా?

నిజానికి, నాటి పరిస్థితికి నేటి పరిస్థితికి సామ్యం లేదు. నాడు దేశ రాజకీయాలపై, కాంగ్రె స్‌పై ఇందిరాగాంధీది ఏకచ్ఛత్రాధిపత్యం. కేంద్రంలో ఆమె నాయకత్వానికి ఎదురు లేదు. ప్రతి పక్షాలు బలంగా లేవు. కాంగ్రెస్‌కు మరో ప్రత్యామ్నాయమే లేదు. అందుకే ఆ రోజు ఇందిరా గాంధీ ఏం నిర్ణయం తీసుకున్నా చెల్లిపోయింది. ఇప్పుడా పరిస్థితి లేదు. దేశ రాజకీయాలపై కాంగ్రెస్‌ గుత్తాధిపత్యం బద్దలయి చాలా కాలమయింది. సంకీర్ణ రాజకీయాల యుగం వచ్చే సింది. సోనియాగాంధీ ఇందిరాగాంధీ కాలేరు. అలా వ్యవహరించడం సాధ్యం కాదు. ఎందు కంటే సోనియాగాంధీ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రాంతీయ పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి. ప్రతి పది లోక్‌సభ స్థానాలనూ జాగ్రత్తగా కాపాడుకోవలసిన పరిస్థితి. కేంద్రం లో పది పదిహేను లోక్‌సభ స్థానాలు ఉంటే, ఏ పనినయినా సాధించుకునే అవకాశం ఇప్పుడు ఉన్నది. ఇక తెలంగాణ విషయం. 1969లో తెలంగాణ ప్రజలు ఒంటరి వారు. చిన్నాచితక పార్టీలు కొన్ని మద్దతు ఇచ్చినా, వాటి ప్రభావం తక్కువ. ఇప్పుడు అలా కాదు, జాతీయ స్థాయి లో తెలంగాణ ఉద్యమానికి ప్రధాన ప్రతిపక్షమైన బిజెపితో పాటు అనేక రాజకీయ పక్షాలు మద్దతు ప్రకటించాయి. 20 రాజకీయ పక్షాలు లిఖితపూర్వకంగా లేఖలు రాశాయి. తీర్మానాల ద్వారానో, లేఖల ద్వారానో తెలంగాణకు మద్దతు ప్రకటించిన పార్టీల బలం 217 మంది. కాంగ్రెస్‌ కూడా చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం కాదని ఉత్తరాంచల్‌, చత్తీస్‌ఘడ్‌, జార్కండు రాష్ట్రాల ఏర్పాటుతో తేలిపోయింది. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్‌ నిర్ణయించుకుంటే పార్లమెం టులో మెజారిటీ సరిపోతుంది. తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వయంగా తెలంగా ణ కావాలని పట్టుబడుతున్నారు. ఇంతటి అనుకూల పరిస్థితి 1969లో లేదు.

నాడు తెలంగాణ ఉద్యమంపై కాసు బ్రహ్మానందారెడ్డి ఉక్కుపాదం మోపారు. తీవ్రంగా అణచివేసే ప్రయత్నం చేశారు. ఉద్యమకారులను పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపారు. అయి తే అప్పుడు తెలంగాణ ఉద్యమం గోడు జాతీయస్థాయిలో ఎవరికీ పట్టలేదు. ఉద్యమం హింసా రూపం తీసుకుంటే, దానిని అడ్డం పెట్టుకుని ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే తరహా అణచివేత కు దిగే అవకాశం లేకపోలేదు. ఈ ప్రభుత్వం అవసరమైతే ముస్లింలను, లాండ్‌ మాఫియాను రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని తెలంగాణ మేధావులు ముందుగానే అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ సమస్య జాతి దృష్టిని ఆకర్షించిన సమస్య. నలుగురు మాజీ ప్రధానులతోపాటు పలు జాతీయ రాజకీయ పక్షాల మద్దతు ఉన్న నినాదం. అధికార యుపిఎలోనే అత్యధిక పక్షాలు తెలంగాణకు అను కూలంగా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారులు ఇప్పుడు ఏకాకులు కాదు.

వామపక్షాలు 1969లో విశాలాంధ్ర నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించాయి. వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేశాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడూ ఆ పార్టీలు విధాన పరంగా తెలంగాణను వ్యతిరేకిస్తున్నా, పార్లమెంటులో ఆ బిల్లును ప్రతిఘటించడానికి సిద్ధంగా లేవు. యాభైయ్యేళ్ల స్వాతంత్య్రం తర్వాతకూడా తెలంగాణ ఆశించిన ప్రగతిని సాధించలేక పోయిందని వామపక్షాలూ అంగీకరిస్తున్నాయి. తెలంగాణ వెనుకబాటుతనాన్ని గుర్తిస్తూనే, ప్రత్యేక ప్యాకేజీలు కోరుతున్నాయి. ఆ పార్టీలలో కూడా, ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో ప్రత్యే క రాష్ట్ర వాదాన్ని ఆమోదించే వారి సంఖ్య పెరిగింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తాము అడ్డం పడుతున్నామని కాంగ్రెస్‌ చెప్పడాన్ని వామపక్షాలు అంగీకరించడం లేదు. 'కాంగ్రెస్‌ మా భుజాలపై తుపాకిని పెట్టి టిఆర్‌ఎస్‌ను కాల్చాలని చూడడం సహించం' అని సిపిఎం నాయ కులు స్పష్టంగానే చెబుతున్నారు. అందువల్ల 1969నాటి వీధిపోరాటాలు పునరావృతమయ్యే పరిస్థితి ఇప్పుడు లేదు. అయితే తెలంగాణ ఉద్యమకారులు హింసాకాండకు దిగితే వామప క్షాలు ఇప్పుడుకూడా మౌనంగా ఉండకపోవచ్చు. ఉద్యమం శాంతియుతంగా జరిగినంత కాలం వారి నుంచి ప్రతిఘటన ఉండే అవకాశం లేదు.

వీటన్నింటికీ మించి తెలంగాణ ఉద్యమంలో ఈ సారి పరిపక్వత కనిపిస్తున్నది. ఉద్యమ కారుల్లో ఆవేశం కంటే ఆలోచన, విద్వేషం కంటే విచక్షణ కనిపిస్తున్నది. అప్పుడో ఇప్పుడో నరేంద్ర వంటి వారు ఆవేశపడుతున్నా, రక్తపాతం జరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించు కోవాలన్నది తమ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖర్‌రావు పదేపదే చెబు తుండడం గమనించవలసిన అంశం. 'అన్నదమ్ముల్లా కలసి ఉన్నాం, అన్నదమ్ముల్లా విడి పోదాం' అన్న భావన ఉద్యమకారుల్లో కనిపిస్తున్నది. ఉధృతి పెరిగిన నదీ ప్రవాహాలు కట్టలు తెంచుకున్నట్టు, ఉద్యమాలు కూడా ఏదో ఒక దశలో కట్టలు తెంచుకుని అదుపు తప్పే అవకా శాలు ఉన్నప్పటికీ దాని విపరీత పర్యవసానాలు తెలిసిన తరం ఇప్పటి ఉద్యమంలో ఉండడం ఒకింత మేలు. ఏకారణం చేతనయినా ఈసారి హింసాకాండ ప్రబలితే పరిస్థితి ఎవరి చేతు ల్లోనూ ఉండదని, అన్నివైపులా అపారనష్టం ఉంటుందన్న గ్రహింపు అందరిలోనూ ఉంది. నిజానికి కోస్తా, రాయలసీమ ప్రజానీకంలో కూడా గతంలో వలె తెలంగాణ ఇవ్వకూడదన్న తెగింపు లేదు. నిరంతరం కలహాల సహవాసం కంటే ఏదో ఒకటి తేలిపోతేనే మంచిదన్న అభిప్రాయం చాలా మందిలో కనిపిస్తున్నది.

తెలంగాణ సమస్యను రాజకీయంగానే పరిష్కరించుకోవాలి. పార్లమెంటు ద్వారానే పరిష్క రించుకోవాలి. తెలంగాణలో ఇప్పుడు భద్రాచలం కాకుండా 15 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. పునర్విభజన తర్వాత ఇవి 17 అవుతాయి. సంకీర్ణ రాజకీయాల యుగంలో 17 స్థానాలతో ఏదైనా సాధించడం అసాధ్యం కాదు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరే శక్తులు ఈ స్థానాలలో విజయం సాధించగలిగితే, కేంద్రంలో నిర్ణయాలను ప్రభావితం చేయడం కష్టమూ కాదు. 1969 ఉద్య మం తెలంగాణ ప్రజల సంఘటిత శక్తికి ప్రతీక. నాడు తెలంగాణ ప్రజలు 11 లోక్‌సభ స్థానా లలో తెలంగాణ ప్రజాసమితి సభ్యులను గెలిపించి, తమ ప్రత్యేక రాష్ట్ర వాంఛను ప్రగాఢంగా చాటుకున్నారు. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు అటువంటి సంఘటిత శక్తినే ప్రదర్శిం చాలని కోరుకుంటే తప్పులేదు. అలనాటి విజయాలను పునరావృతం చేయాలనుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండనక్కరలేదు. అప్పట్లో ఇందిరాగాంధీ ఏకధ్రువ రాజకీయాల వల్ల తెలంగాణ ప్రజల తీర్పు ఉపయోగపడకపోయి ఉండవచ్చు. తెలంగాణ ప్రజలు 1969లో అంతటి ఘన విజయాన్ని సాధించీ ఘోరంగా అవమానింపబడ్డారు. అటు కాంగ్రెస్‌, ఇటు చెన్నారెడ్డి కలసి తెలంగాణ హృదయాన్ని ఛిద్రం చేశారు. ఆ విజయం పనికి రాలేదు. ఇప్పుడు పరిస్థితి మారి పోయింది. తెలంగాణ ప్రజలు రాజకీయాలను పక్కనబెట్టి ప్రత్యేక రాష్ట్రంకోసం ఒక్కటి కాగ లిగితే, అలనాటి సంఘటిత శక్తినే చాటగలిగితే తెలంగాణ ప్రజలు మరోసారి ఓడిపోయే అవ కాశాలు లేవు. మరోసారి అవమానానికి గురికావలసిన అవసరం ఉండదు. పునరావృతం కావలసింది నాటి సంఘబలమే, కాని విద్వేషాగ్ని కాదు, హింసాకాండ కాదు. ఇందుకు తెలం గాణ ప్రజల్లోనే రాజకీయ దృఢసంకల్పం ప్రబలాలి.
courtesy : andhrajyothy.com

1 comment:

rk blogs in said...

మన తెలంగానాంధ్ర లొల్లి హాలీవుడ్ ని కుడా తాకినట్టుంది…….ఇక్కడ చూడండి

http://dedicatedtocpbrown.wordpress.com/2010/03/03/%E0%B0%AE%E0%B0%A8-%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A8%E0%B0%BE%E0%B0%82%E0%B0%A7%E0%B1%8D%E0%B0%B0-%E0%B0%B2%E0%B1%8A%E0%B0%B2%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BF-%E0%B0%B9/