Monday, September 18, 2006

తెలంగాణ విమోచన - సిహెచ్‌. విద్యాసాగర్‌ రావు

వందేమాతర గీతాన్ని ఆలపించడానికి నిరాకరించిన ఉదంతం జాతి జీవనాన్ని కలచివేస్తుంది. వందసంవత్సరాల క్రితం స్వదేశీ, స్వజాతీ, స్వాతంత్య్ర ఉద్యమాల జ్వాలలను రగిల్చిన జాతీయ గేయంలోని ఆ చరణాలు తల్లి భారతికి ఆభరణాలు. కోట్లాది భారతీయులను ముందుకు నడిపించే కరదీపికలు! అలాంటి గీతానికి మతాల మకిలిని అంటించడం బాధ కలిగించింది. అదే విధంగా హైదరాబాద్‌ విమోచనోద్యమం ఫలించి విజయ కేతనాన్ని ఎగరవేసిన చరిత్రాత్మక రోజు 17 సెప్టెంబర్‌ 1948. భారతదేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలు 1947 ఆగస్టు 15న స్వేచ్ఛావాయువులు పీల్చుకోగా, తెలంగాణ ప్రజలు స్వాతంత్య్రం కోసం ఇంకో ఏడాదికిపైగా ఎదురుచూడవలసి వచ్చింది. చివరికి సెప్టెంబర్‌ 17న భారత సైన్యం నిజాం మెడలువంచింది. ఈ విజయోత్సవాన్ని అధికారికంగా ప్రభుత్వం నిర్వహించకపోవడం కోట్లాది తెలంగాణ ప్రజల మనోభావాలను కించ పరచడమే అవుతుంది. గతంలో హైదరాబాద్‌ సంస్థానంలో ఉండి, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ తరువాత, మహారాష్ట్రలో కలసిన 5 జిల్లాలు, కర్ణాటకలో కలసిన 3 జిల్లాలలో అక్కడి ప్రభుత్వాలు ప్రతియేటా సెప్టెంబర్‌ 17న విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తున్నాయి. మన రాష్ట్రంలో మాత్రం దీన్ని పట్టించుకోలేదు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ తరువాత కూడా- మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు నిర్వహించినట్టుగా అధికారికంగా 17 సెప్టెంబర్‌ నాడు తెలంగాణ జిల్లాలలో విమోచన ఉత్సవాన్ని జరపడంలో ఎందుకు సందేహిస్తున్నారో అనే అంశం అందరినీ ఆలోచింపచేస్తుంది. బాధను కలిగిస్తుంది. ఇంతవరకు అధికారికంగా ఈ ఉత్సవాన్ని జరపక పోవడమే ఘోరతప్పిదం. దాన్ని సవరించడం ఆదర్శప్రాయమవుతుంది. కోట్లాది ప్రజల మనోభావాలను గౌరవించడమే కాకుండా భావితరాలకు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. అయితే ఈ విమోచన అనేది మస్లింలపైన హిందువుల విజయంగా పరిగణించి మ్‌ుస్లిం సోదరులు వ్యతిరేకిస్తారేమో అనే అనుమానాన్ని నర్మగర్భంగా తెలియజేస్తున్నది ప్రభుత్వం. వాస్తవానికి తెలంగాణ విమోచన దేశ స్వాతంత్య్ర పోరాట క్రమంలోనే కొనసాగిన వీరోచిత పోరాట ఫలితమని, ఎంతో మంది ముస్లిం సోదరులు ఇందుకోసం బలిదానం చేశారని గుర్తుంచుకోవాలి. తురేబాజ్‌ ఖాన్‌ (1857), షోయబుల్లా ఖాన్‌ (1948) లాంటి వారు తమ ప్రాణాలను త్యాగం చేసిన నిజాన్ని మనం మరువరాదు. నిజాంకు, రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో అనేకమంది ముస్లిమ్‌లు పాల్గొన్నారు. కాబట్టి తెలంగాణ విమోచన ముస్లింలకు వ్యతిరేకమన్న తప్పుడు అభిప్రాయాన్ని ప్రభుత్వం తొలగించుకోవాలి. షోయబుల్లాఖాన్‌ లాంటి పత్రికా సంపాదకుని విగ్రహాన్ని మనం ప్రతిష్టాపన చేసుకోక పోవడం అవమానకరం అన్న సత్యాన్ని గ్రహించాలి. విమోచన దినోత్సవం జరుపుకోవడంపై కమ్యూనిస్టు సోదరులు ఖచ్చితంగా తమ అభిప్రాయాన్ని తెలియజేయకపోవచ్చు. ఎందుకంటే వారు 1951 వరకు భారతదేశంపైన తమ పోరాటాన్ని కొనసాగించారు. అయితే ఈ విమోచన దినాన్ని వారు వ్యతిరేకిస్తారని అనుకోవడం పొరపాటు. ఈ కుంటి సాకులన్నిటినీ ప్రభుత్వం తెరమీదకి తీసుకొనివచ్చి కాలయాపన చేస్తున్నది. ప్రత్యేక తెలంగాణ వ్యతిరేక ప్రభుత్వం కాబట్టి, విమోచన దినాన్ని అధికారికంగా నిర్వహిస్తే ప్రత్యేక తెలంగాణ వాదానికి బలం చేకూరుతుందేమోనన్న భయం ఆవరించి వుందనేది అసలు రహస్వమని బహిర్గతమౌతోంది. అయితే ఇది ఏ ప్రాంతవాసులకూ వ్యతిరేకం కాదనేది మహారాష్ట్ర, కర్ణాటక ప్రజలు బహిర్గతం చేశారు. ఏది ఏమైనా ప్రభుత్వం వచ్చే సెప్టెంబర్‌ 17ను తెలంగాణ విమోచన దినంగా ప్రకటించి, అధికారికంగా ఉత్సవాలను నిర్వహించాలని సర్వత్రా కోరుతున్నారు.

- సిహెచ్‌. విద్యాసాగర్‌ రావు
కేంద్ర మాజీ మంత్రి

నిజాంను చంపాలనుకున్నాం... - నారాయణరావు పవార్‌

రోజూలాగే నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ సవారీ రాజప్రాసాదం ‘కింగ్‌కోఠీ’ నుంచి బయలుదేరింది. కారు ఆల్‌ సెయింట్స్‌ స్కూలు దగ్గరికి ్‌వచ్చిందో లేదో... అంతదాకా ఏమీ ఎరగనట్టు రోడ్డు పక్కని గుంపులో నిలుచున్న ఒక ఇరవైళ్ళ యువకుడు తన పొడవాటి షేర్వాణీ జేబులోంచి బాంబు తీసి నిజాం కారు మీదికి బలంగా విసిరేశాడు. అయితే ఈ సారి మాత్రం అదృష్టం ఉస్మాన్‌ అలీఖాన్‌ పక్షాన ఉంది. నేరుగా యమపురికి పంపటానికి దూసుకువచ్చిన శక్తివంతమైన ఆ బాంబు కారు కిటికీ అద్దానికి తగిలి ఇవతలికి పడి రోడ్డు మీదే చెవులు చిల్లులు పడే శబ్దంతో పేలిపోయింది. బాంబు శకలాలు చెల్లా చెదరుగా పడ్డాయి. అక్కడ దట్టమైన పొగ అలుముకుంది. ఇద్దరికి గాయాలయ్యాయి. హాహాకారాలు మిన్నంటాయి. నిజాం మాత్రం వెంట్రుక వాసిలో తప్పించుకున్నాడు. బతుకు జీవుడా అనుకుంటూ ఆదరాబాదరాగా ఇంటి ముఖం పట్టాడు!

ఇంకో బాంబు తీసి వేయబోతూండగా ఆ సాహసిక యువకుడిని పోలీసులు చుట్టుముట్టారు. కిరాతకంగా నెత్తురు కారేట్టు కొట్టారు. చిత్రహింసలు పెట్టారు. అయినా ఆ యువకుడు నోరు విప్పలేదు. 1947 డిసెంబర్‌ 4 నాటి రాత్రి ఎనిమిది గంటలకి హైదరాబాద్‌ రేడియో ‘అల్లా దయ వల్ల నిజాం ప్రభువులు క్షేమంగా ఉన్నారు’ అంటూ ప్రత్యేక వార్తను ప్రసారం చేసింది. ప్రజాకంటకుడైన నిజాంను నిర్జించటం కోసమే బాంబు వేశాననీ తన కర్తవ్యాన్ని తాను నిర్వర్తించాననీ ఆ యువకుడు కోర్టు ఎదుట సగర్వంగా ప్రకటించాడు. ఇంతకీ ప్రాణాలకు సైతం తెగించిన ఆ యువకుడు ఎవరు? వీర సావర్కార్‌ వజ్ర సంకల్పమూ రామ్‌ప్రసాద్‌ బిస్మిల్‌ వీరావేశమూ మదన్‌లాల్‌ ధీంగ్రా నిరుపమ సాహసమూ ఖుదీరాంబోస్‌ సర్వసమర్పణ భావమూ.... ఈ అన్నీ కలిసి ‘నారాయణరావు పవార్‌ ’ కాక ఇంకేమవుతాయి?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌ ఆర్య ప్రతినిధి సభ పుస్తకాధ్యక్షుడిగా ఉన్న నారాయణరావు పవార్‌ ఒకనాడు నియంత నిజాంకు సింహస్వప్నం. నిజాంను తుదముట్టించేందుకు బాంబు వేసిన ‘నేరానికి’ (కింగ్‌కోఠీ బాంబు కేసు 1947) ఆయనకు ‘ఉరి’ శిక్ష పడింది. పోలీసు చర్య గనక పది రోజులు ఆలస్యమైవుంటే నారాయణరావు మనకు దక్కివుండేవారు కాదు. అయితే ఇంత త్యాగ ధనుడికీ స్వాతంత్య్ర వీరుడికీ ప్రభుత్వం ఇచ్చిన బహుమానం ఏమిటంటే... పోలీసు చర్య తర్వాత కూడా ఒకటి కాదు రెండుకాదు - పదకొండు నెలల పాటు జైల్లోనే బందీని చేసి హింసించటం! ్‌‘ప్రజాప్రభుత్వం’ వచ్చిన రెండేళ్ళదాకా ఏ ఉద్యోగమూ రానివ్వకుండా పేరును ంౌడీ షీటర్లకి మల్లే బ్లాక్‌ ల్‌ిస్ట్‌లో ఉంచటం! అన్నిటికన్నా లజ్జాకరమైన సంగతి ఏమిటంటే, తనని కనీసం ‘రాజకీయ ఖైదీ’గా అయినా గుర్తించమని భారత ప్రభుత్వాన్ని కోరుతూ ఆయన పందొమ్మిది రోజుల పాటు నిరాహార దీక్ష చేయవలసి రావటం. ఇంకా హేయమైన విషయమేమిటంటే జైలు నుంచి విడుదలకు ‘మాఫినామా’ (క్షమాపణ పత్రం) రాసివ్వమని మన ప్రభుత్వమే నారాయణరావుని అడగటం! అట్లా ఎన్ని ఒత్తిడులు వచ్చినా తలవంచని ధీరోదాత్తుడిని చివరికి ప్రజల ఒత్తిడికి తలవంచి ప్రభుత్వం బేషరతుగా విడుదల చేసింది.

1926 అక్టోబర్‌ మూడున వరంగల్‌ పోతుగడ్డపై పుట్టిన నారాయణరావు పవార్‌ ఒక మామూలు రైల్వే హమాలీ బిడ్డ. స్వాతంత్య్ర లక్ష్మి పూరి గుడిసెల్లోనే పుట్టిందన్నమాట ఎంత నిజం. ఇప్పటికీ సామాజిక కార్యమగ్నులై, ఏడుపదులు దాటిన నారాయణరావు పవార్‌తో హైదరాబాద్‌ సంస్థాన విమోచనదిన (సెప్టెంబర్‌ 17) శుభావసరాన ముఖాముఖి...

ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు ఇవీ...

? భారత స్వాతంత్య్రసమరంలో భాగమైన హైదరాబాద్‌ విముక్తి పోరాట పూర్వరంగాన్ని గురించి చెప్పండి...

- ఆ రోజుల్లో నిజాం వ్యతిరేకపోరాటమే మాకు స్వాతంత్య్రోద్యమం. నిజాం ఆంగ్లేయుల తొత్తు. నిజాం పెత్తనాన్ని కూలదోయడమే మా దృష్టిలో స్వాతంత్య్ర సాధన. ఆనాడు రాష్ట్రంలో రాజకీయ ఉద్యమమేదీ ఉండేది కాదు. ఆర్యసమాజమే మొదటి సారిగా నిజాం సవాలును స్వీకరించింది. ఓం ధ్వజంపైనా సామూహిక హవనం పైనా నిషేధం ఉండేది. ఏ కార్యక్రమం చేయాలన్నా నిజాం అనుమతి తప్పనిసరి! అందుకే పౌరహక్కుల కోసం 1939 అక్టోబర్‌ 15 నుంచి ఆర్యసమాజం ఉద్యమాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత సార్వదేశిక్‌ ఆర్యప్రతినిధిసభ రంగం లోకి వచ్చింది. అప్పటి నుంచీ ఉద్యమం జాతీయ ్‌స్థాయిలో సాగింది. ఇది ్‌ప్రారంభమైంది 1939 జనవరి 31 నుంచి. ఆర్యసమాజ ప్రచారంపై నిషేధాన్ని ఎత్తివేయాలనీ ఉర్దూయేతర భాషల మాధ్యమంతో అంటే కన్నడ, తెలుగు, మరాఠీ మీడియాలలో పాఠశాలలు నడిపించేందుకు అనుమతి ఇవ్వాలనీ రాజకీయ ప్రాతినిధ్యం కల్పించాలనీ కోరుతూ ఈ ఉద్యమం నడిచింది. మొత్తం పన్నెండు వేల మంది ఈ సత్యాగ్రహంలో పాల్గొన్నారు. చివరికి నిజాం ప్రభుత్వం దిగి వచ్చింది. ఆర్యసమాజం డిమాండ్లన్నిటికీ ప్రభుత్వం ఒప్పుకుంది. ఆనాడు కమ్యూనిస్టులైనా కాంగ్రెస్‌వారైనా అందరికీ ఆర్యసమాజమే వేదిక అయ్యింది.

? నిజాం వ్యతిరేకోద్యమంలో మీరు చారిత్రక భూమికను నిర్వహించారు. ఆనాటి మీ స్ఫూర్తివంతమైన పోరాటం గురించి వివరంగా చెబుతారా? మీ వ్యక్తిగత జీవితంతో సహా...

- నేను వరంగల్‌ లో పుట్టాను. మా కుటుంబం ఎప్పుడో కరువు మూలాన జరుగుబాటు లేక తొంభై ఏళ్ళ కిందట మహారాష్ట్ర నుంచి ఇక్కడికి తరలి వచ్చింది. మా తండ్రిగారు పండరీనాథ్‌గారు వరంగల్‌లోనే రైల్వే హమాలీగా కుదురుకున్నారు. నేను ఏడో క్లాసు దాకా మఠ్వారా ఇంగ్లీష్‌్‌ స్కూల్లో చదివాను. 8, 9, 10 క్లాసులనూ ఇంటర్మీడియట్‌ కోర్సునూ హన్మకొండలో చదివాను. ఎనిమిదో క్లాసు నుంచే నాకు ఆర్యసమాజంతో పరిచయం కలిగింది. ఇంటర్‌ తర్వాత ‘లా’ క్లాసు చదవటానికి నేను హైదరాబాద్‌ వచ్చాను. అవి హైదరాబాద్‌ విముక్తి పోరాటం ఉద్ధృతంగా సాగుతూన్న రోజులు. ఆ పరిస్థితుల్లో 1946 జూన్‌ 16 నాడు నిజాం ఒక ఫర్మానా జారీ చేశాడు. బ్రిటిష్‌ హుకుమత్‌ (శాసనాధికారం) పోతే హైదరాబాద్‌ సర్వసత్తాక ర్‌ాజ్యంగా ఉంటుందే తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ భారత యూనియన్‌లో చేరబోదన్నది ఆ ఫర్మానా సారాంశం. అప్పటికే బహదూర్‌ యార్జంగ్‌లాంటి వాళ్ల చేతుల్లో హిందువులు నానా యాతనలు పడుతున్నారు.
ఈ పరిస్థితుల్లో 1947 లో వచ్చిన ఒక చట్టం నిజాంకు వరంగా పరిణమించింది. భారత సంస్థానాలు పాకిస్థాన్‌లోనైనా కలవొచ్చు - భారత్‌లోనైనా కలవొచ్చు - లేదా స్వతంత్రంగానైనా ఉండొచ్చు - ఇదీ ఆ చట్టం. ఈ చట్టం ప్రకారం నేను సర్వస్వతంత్రుడిని అన్నాడు నిజాం. కానీ ఇక్కడి జనత మాత్రం ప్రజా రాజ్యమే కావాలంది. నెహ్రూగారేమో హైదరాబాద్‌ ప్రజలే వారి ఉనికి గురించి తేల్చుకోవాలన్నారు. ఇక సంఘర్షణ అనివార్యం అయ్యింది. ప్రజా నాయకులందర్నీ ప్రభుత్వం జైళ్ళలోకి నెట్టింది. ఆ రోజుల్లో మేం ఎనిమిది మందిమి ఒక అజ్ఞాతం దళంగా పని చేస్తూ ఉండేవాళ్ళం. అంతా ఆర్యసమాజీయులమే. నేనూ, బాల్‌కిషన్‌, పండిత్‌ విశ్వనాథం, రెడ్డి పోచనాధం, గంగారాం, జగదీశ్‌, జి.నారాయణస్వామి ఇందులో సభ్యులం. కొండాలక్ష్మణ్‌ బాపూజీ కూడా మాకు సహకరించారు.

మేమంతా హైదరాబాద్‌లోని కొల్సావాడి దగ్గరి బాలకిషన్‌ ఇంట్లో బైఠక్‌ చేసుకునేవాళ్ళం. అక్కడే దేశ స్థితిగతులపై చర్చలు జరిగేవి. ఒకరోజు దారుస్సలాంలో మహ్మదాలీ జిన్నా ప్రసంగించాడు. అది కేవలం హిందువులపై విషవమనం. ఆ ప్రసంగం విన్న మాకు రక్తం మరిగిపోయింది. ఈ నిజాం రాజ్యాన్ని తుదముట్టించ్‌ేందుకు చివరి శ్వాస దాకా పోరాడాలని ఆనాడే మేం ప్రతిజ్ఞ చేశాం. ఆ రోజుల్లోనే నిజాం రాష్ట్రానికి ‘మహజరీన్‌ ’ల రాక మొదలైంది. హైదరాబాద్‌ రాష్ట్రాన్ని ముస్లిం జనబాహుళ్య రాజ్యం చేయటం కోసం ఎక్కడెక్కడి ముస్లింలూ ఇక్కడికి రాసాగారు.

నిజామూ రజాకార్లు వేసిన ఎత్తుగడ ఇది. అ్‌ట్లా వచ్చిన వారికి ఎర్రగడ్డ, మౌలాలీల దగ్గర శిబిరాలూ ఏర్పాటయ్యాయి. మొత్తం ఆ రోజుల్లోనే 12 లక్షల మంది ఇలా వలస వచ్చారు. మాకు ఒళ్ళు మండిపోయింది. ఇట్లా ‘మహజరీన్ల’ను తీసుకువచ్చే ప్రత్యేకరైలును పడేద్దామని ప్రయత్నించాం ఘట్‌కేసర్‌ - మౌలాలీల నడుమ పట్టాల బోల్టులు విప్పదీసేశాం. కానీ ఒక గ్యాంగ్‌మన్‌ కంటపడడంతో రైలు ఆగిపోయింది. ఆ తర్వాత మూసీ నది ఒడ్డున వున్న రిజర్వ్‌పోలీస్‌ గుర్రాల కొట్టాంలో టైంబాంబ్‌ పెట్టాం. అది పేలింది. దాంతో పహారా ఎక్కువైంది. ఈ పరిస్థితుల్లో ఏకంగా నిజాంనే ఖతం చేస్తే... అన్న ఆలోచన వచ్చింది మాకు.

అదే జరిగితే నిజాం రాష్ట్రంలో అంతర్యుద్ధం తప్పదనీ పరిణామంగా భారత ప్రభుత్వం కలగజేసుకుంటుందనీ మేము అంచనా వేశాం. ఇక నిజాంను చంపటం కోసం ఆయుధాల సేకరణ మొదలైంది. షోలాపూర్‌కీ బొంబాయికీ వెళ్ళి నేనూ విశ్వనాథం 600 రూపాయలు ఖర్చు చేసి మూడు అమెరికన్‌ మిలెటరీ చేతి బాంబులనూ రెండు రివాల్వర్లనూ (దొరికితే ఆత్మహత్య చేసుకోవడానికి) మూడు విషం సీసాలను తీసుకువచ్చాం. మాతృభూమిని విముక్తం చేయాలన్నదే మా ఆరాటం. దానికి మేం ఏ మూల్యమైనా చెల్లించటానికి సిద్ధంగా ఉన్నాం. మాది ఆత్మాహుతి దళం. క్రాంతికారి తన శిరసును తన చేతుల్లో ఉంచుకుని ముందుకు సాగుతాడు. ఎన్ని అవరోధాలు ఎదురైనా సరే అతడు తన సంకల్పం నుంచి ఎన్నటికీ విచలితుడు కాడు. ఆ రోజుల్లో నేతాజీ ప్రసంగాలు మమ్మల్ని బాగా ఉత్తేజితుల్ని చేశాయి.

నిజాంను మట్టుబెట్టటానికి 1947 డిసెంబర్‌ 4న ముహూర్తాన్ని నిశ్చయించాం. ఎందుకు నిజాంను చప్పాల్పి వచ్చిందో వివరంగా రాసి ఆ వాజ్ఞ్మూలంపై నేనూ, జగదీశ్‌, గంగారాం మా రక్తంతో సంతకాలు చేశాం. ఆ ్‌ప్రకటనను బాలకిషన్‌కి ఇచ్చి బొంబాయి పంపించివేశాం. విశ్వనాథ్‌ను విజయవాడ పొమ్మన్నాం. ఇదంతా ఎవరూ పట్టుబడకుండా ఉండేందుకు. కింగ్‌కోఠీ నుంచి రోజూ సాయంత్రం చార్మినార్‌కి పోయి అక్కడ నమాజు చేసుకుని దారుషఫా వెళ్లి తన తల్లి సమాధిని చూసుకుని వచ్చే అలవాటు నిజాం కు ఉండేది. దాన్ని మేం ఉపయోగించదలుచుకున్నాం. సాయంత్రం 5 గంటలకి కింగ్‌కోఠీ నుంచి బయలుదేరగానే ఆల్‌సెయింట్స్‌ స్కూలు దగ్గర నేను బాంబు వేయాలన్నది పథకం. నా సహచరుల్లో జగదీశ్‌ బొగ్గుల కుంట దగ్గరా, గంగారాం మడిస్ట్‌ స్కూలు దగ్గరా కాపు వేసి ఉండాలి. నా దాడి గనక విఫలమైతే ఒకరి తర్వాత ఒకరుగా జగదీశ్‌, గంగారాం నిజాంపై హత్యాయత్నం చేయాలి. నా దగ్గర రెండు బాంబులు పెట్టుకున్నాను. జగదీశ్‌ దగ్గర ఒక బాంబూ ఒక రివాల్వరూ, గంగారాం దగ్గర ఒక బాంబూ ఒక రివాల్వరూ ఉన్నాయి. అందరి దగ్గరా విషం సీసాలు సిద్ధం.

అనుకున్నట్టుగానే నిజాం కారు బయలుదేరింది. గంగారాం తీసుకువచ్చిన సైకిల్‌ పై వచ్చిన నేను దాన్ని ఒక పక్కన నిలిపి కారు కోసం ఎదురుచూస్తూ నిలుచున్నాను. కారు కనబడగానే నేను చప్పున కదిలాను. షేక్‌హూసేన్‌ అనే ఒక కానిస్టేబుల్‌ నన్ను ఆపటానికి ప్రయత్నించాడు. అయితే కారు పది అడుగుల దూరంలో ఉండగా నేను నా జేబులోంచి బాంబు తీసి విసిరాను. అయితే ్‌ అది కారు అద్దానికి తగిలి బయటికే పడి రోడ్డు మీదే పేలింది. కారు అద్దాలు పగిలిపోయాయి. అంతా కకావికలయ్యారు. రెండో బాంబు తీసి వేద్దామని ప్రయత్నిస్తుండగానే షేక్‌హుసేన్‌ వచ్చి నా చేయి పట్టేసుకున్నాడు. ఇంతలో డ్రైవర్‌ కారును మళ్ళించివేగంగా నిజాంను తీసుకుని వెనక్కి వెళ్ళిపోయాడు. దీంతో నా ఇద్దరు సహచరులకు అవకాశం చిక్కలేదు. వారు దాడి సఫలమై ఉంటుందనుకుని వెళ్లిపోయారు. ఈ దాడిని చూసి ఒక చావూస్‌ బల్లెంతో వచ్చి నన్ను పొడవబోయాడు. అయితే ఎస్‌.ఐ. జోసెఫ్‌ అడ్డుకున్నాడు. ఇంటరాగేట్‌ చేశాక చంపేయవచ్చునని నచ్చజెప్పాడు.

అక్కడ నన్ను విపరీతంగా కొట్టారు. నా పళ్లు చాలా ఊడిపోయాయి. రక్తంతో నా బట్టలన్నీ తడిసిపోయాయి. నన్ను అట్లా కొట్టుకుంటూ పోలీస్‌ స్టేషన్‌కు తీసుకువెళ్ళారు. అప్పుడు చూశాను నేను, కింగ్‌కోఠీ వరండాలో వణుకుతూ నిలుచున్న నిజాంను! పోలీస్‌స్టేషన్‌లో నా పేరు ‘బాబు’ అని చెప్పాను. నేను హిందువునో ముస్లిమునో తెలుసుకునేందుకు నా ప్యాంట్‌ విప్పి చూశారు. సుంతీ లేకపోవటంతో నేను హిందువునే అని తేల్చుకున్నారు. ఎందుకంటే ఆ రోజుల్లో బహదూర్‌ యార్జంగ్‌ కూడా నిజాంకు శత్రువయి ఉన్నాడు. అతడైనా నిజాంపైన దాడి చేయించే అవకాశం ఉందని వారు తలచారు. ఇంతలో నిజాం ప్రైమ్‌మినిష్టర్‌ లాయకలీ వచ్చాడు. నువ్వు మొహజిర్‌ వా అనడిగాడు. ఆ తర్వాత ఏసీపి ఫజలే రసూల్‌ఖాన్‌ వచ్చి నన్ను పోలీసు కమిషనర్‌ ఆఫీసుకు తీసుకుపోయాడు.

అక్కడ నన్ను లాకప్‌లో పడేశారు. నా వెనక ఎవరెవరు ఉన్నారో చెప్పమని నన్ను లాఠీలతో కొట్టారు. నా కీళ్ళపై మోదారు. నేను నోరు విప్పలేదు. డిసెంబర్‌ 18 వరకూ టార్చర్‌ చేశారు. ఈ లోపు హత్యాయత్న స్థలం దగ్గర వదిలేసిన సైకిల్‌ (ఎస్‌.కె.10) ఆధారంగా గంగారాం కూడా పట్టుబడ్డాడు. మొత్తం 15 రోజుల పాటు 200 మందిని ఇంటరాగేట్‌ చేశారు. మమ్మల్ని చంచల్‌గుడ జైలుకు తరలించారు. 1947 డిసెంబర్‌ 19 నుంచీ 1948 మార్చి 26 వరకూ జుడీషియల్‌ కస్టడీ.

బషీరుద్దీన్‌ అనే ఫస్ట్‌క్లాస్‌ మేజిస్ట్రేట్‌ ఎదుట మొదట విచారణ సాగింది. నిజాం అనేవాడు పెద్ద దేశ ద్రోహి కాబట్టే చంపాలనుకున్నామని ప్రకటించాం. 35 మందిని సాక్షుల్ని మేజిస్ట్రేట్‌ విచారించాడు. నా మీద సెక్షన్‌ 78 పెట్టారు. ‘అసఫియా పీనల్‌ కోడ్‌’ ప్రకారం అది ‘రాజుకు వ్యతిరేకంగా పోరాటం నడిపే నేరం’. దానికి శిక్ష మరణమే కాబట్టి కేసు సెషన్స్‌ కోర్టుకు బదిలీ అయింది. మా కోసం రాంలాల్‌ కిషన్‌ అనే న్యాయవాదిని ప్రభుత్వమే నియమించింది. రైతుల ధాన్యంపై ఎక్కువ లేవీని వసూలు చేస్తున్నారన్న విషయాన్ని నిజాం దృష్టికి తేవడానికి మాత్రమే దాడి చేశానని చెప్పమన్నాడు, ఆ న్యాయవాది. అయితే నేను ఒప్పుకోలేదు. అసలు న్యాయవాదే వద్దన్నాను. చివరికి 1948 మార్చి 27 నాకు ఉరిశిక్ష పడింది. నా సహచరుడు గంగారాంకు యావజ్జీవ కారాగారవాసం విధించారు. ఈ శిక్షలను హైకోర్టూ, ఆ తర్వాత జ్యుడిషియల్‌ కమిటీ కూడా ధ్రువీకరించాయి. అంతలో దైవికంగా పోలీసు చర్య ప్రారంభమైంది. అది సెప్టెంబరు 13. సెప్టెంబరు 17 నాటికి హైదరాబాద్‌ రాష్ట్రం విముక్తమైంది.

కానీ మేము విడుదల అవడానికి ఇంకో 11 నెలలు పట్టింది! నిజాంని రాజ్‌ప్రముఖ్‌ చేయడమే దీనికి కారణం. ఇది కేవలం బుజ్జగింపు ధోరణి. కానీ జనం మా వెంట ఉన్నారు. మా విడుదల కోసం హర్తాళ్లు జరిగాయి. మా తండ్రిగారు వల్ల భభాయి పటేల్‌ వద్దకు వెళ్లారు. వెంటనే పటేల్‌ మిలటరీ గవర్నర్‌ జె.ఎన్‌. చౌదరిని పిలిచి మమ్మల్ని విడుదల చేయమని ఆదేశించాడు. కానీ ప్రభుత్వం మా పట్ల అన్యాయంగా ప్రవర్తించింది. మేము మాఫీనామా రాసిస్తేనే విడుదల చేస్తామంది. దీనికి మేము ఒప్పుకోలేదు. చివరికి మేము రాజకీయంగా ఖైదీలుగా గుర్తింపబడడం కోసం కూడా ఆమరణ నిరాహార దీక్ష చేయాల్సి వచ్చింది.. ఆఖరుకు మా డిమాండ్‌ను ఒప్పుకున్నారు. అప్పటిదాకా మా శరీరాలపై ఇంకా గొలుసులు అట్లాగే వేళ్లాడుతూ ఉండేవి. మాకు ఖైదీల యూనిఫామే ఉండేది. మాఫీనామా ఇవ్వడానికి మేము ఒప్పుకోకపోయేసరికి ఏం చేయాలో ప్రభుత్వానికి తోచలేదు. అవతల ప్రజల ఒత్తిడేమో పెరుగుతోంది. చివరికి దిగివచ్చిన ప్రభుత్వం బేషరతుగా మమ్మలిద్దర్నీ 1949 ఆగస్టు 10న వదిలిపెట్టింది. అయితే రెండేళ్లదాకా మా పేర్లు ‘బ్లాక్‌ లిస్టు’లో ఉండేవి. మమల్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం క్రిమినల్స్‌గానే పరిగణించింది. ఈ కారణంగా ఒకసారి నేను ఉద్యోగం నుండి తొలగించబడ్డాను కూడా.

? మీరు మాతృభూమి విముక్తి కోసం హింసా మార్గాన్ని ఎంచుకున్నారు కదా, ఇప్పుడు నక్సలైట్ల సాయుధ పోరాటాన్ని కూడా సమర్థిస్తారా..

- మేము గాంధీగారి అహింసను ఎన్నడూ విశ్వసించలేదు. ‘ఈట్‌కా జవాబ్‌ పత్తర్‌ సే హీ దేనా చాహియే’. మాది వైదిక హింస. (వైదికీ హింసా హింసానా భవతి). అది హింస కాదు రాముడు రావణుడిని చంపటమూ, కృష్ణుడు కంసుణ్ని చంపటమూ హింస కానట్టే మాదీ హింస కాదు. దేశం పరాధీనమై ఉన్నప్పుడు జాతీయశక్తులు సృష్టించే ‘టెర్రరిజం’ దుర్మార్గుల గుండెల్లో భీతిని కలగజేస్తుంది. అది జనతకు ధైర్యాన్నీ ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది. అది పరిణతి అయ్యేది క్రాంతిలోనే. ఆ క్రాంతి నుంచి వస్తుంది స్వాతంత్య్రం. ఇక నక్సలైట్ల సంగతంటారా, వ్యవస్థను మార్చుకునేందుకు ఈనాడు బ్యాలెట్‌ మార్గం ఉంది. అది లేనందుకే మేమానాడు సాయుధ పోరాటం చేశాం. ఇప్పుడు చేయవలసింది యువతరంలో చైతన్యాన్ని నింపటం.

? అరవయ్యేళ్ల స్వాతంత్య్రంపై మీ వ్యాఖ్య ఏమిటి...

- ఈ స్వాతంత్య్రం పట్ల మాకు ఎంతమాత్రమూ సంతృప్తిలేదు. అవినీతి ఇవ్వాళ వ్‌ిచ్చలవిడిగా సాగుతోంది. నిరుద్యోగమూ దారిద్య్రమూ ఇంకా అట్లాగే ఉన్నాయి. ఇన్నేళ్లలో కనీసం మనం ఒక జాతీయ అనుసంధాన భాషను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసుకోలేక పోయాం. ఇది నిజంగా విషాదం.

(ఇంటర్వ్యూ- స్వాతి)

Sunday, September 17, 2006

నిజాం తలవంచిన రోజు...

చుట్టుపట్ల సూర్యపేట
నట్టనడుమ నల్లగొండ
ఆవాల హైద్రాబాదు
తర్వాత గోలకొండ
గోలకొండ ఖిల్లా కింద- నీ
గోరి కడ్తం కొడుకో
నైజాము సర్కరోడా! (- యాదగిరి)

దశకంఠుని నిధనం కోసం కోదండనారీ నిధ్వానం జరిగింది. శిశుపాలుని శిరసు కోసం సుదర్శనం బయలుదేరింది... 1948 సెప్టెంబర్‌ 13 (సోమవారం) బ్రాహ్మీ ముహూర్తాన... భారత సేన హైదరాబాద్‌ సంస్థాన విమోచన కోసం పథ సంచలనం ప్రారంభించింది. ‘ఉక్కు మనిషి’ సర్దార్‌ పటేల్‌ మార్గదర్శనం, లెఫ్టినెంట్‌ మేజర్‌ జనరల్‌ మహరాజ్‌ రాజేంద్రసింగ్‌ నిర్దేశకత్వంలో మేజర్‌ జనరల్‌ జె.ఎన్‌. చౌదరి నాయకత్వాన జరిగింది ఈ ‘పోలీసు చర్య’. చౌధరి సేనలతో షోలాపూర్‌ నుంచి బయలుదేరారు. బొంబాయి సెక్టార్‌లో కమాండర్‌ మేజర్‌ జనరల్‌ ఎల్‌.ఎస్‌. బ్రార్‌, మద్రాస్‌ సెక్టార్‌లో ఆపరేషన్స్‌ కమాండర్‌ మేజర్‌ జనరల్‌ ఎ.ఎ. రుద్ర, బేరార్‌ సెక్టార్‌లో బ్రిగేడియర్‌ శివదత్‌ సింగ్‌ ఆయనకు సహకరిస్తున్నారు. ఎయిర్‌ వైస్‌మార్షల్‌ ముఖర్జీ కూడా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. యూనియన్‌ సేనలు మొత్తం ఎనిమిది విభిన్న ప్రాంతాల నుంచి హైదరాబాద్‌ సంస్థానాన్ని ముట్టడించాయి. అయితే ప్రధానమైన ముట్టడి షోలాపూర్‌, బెజవాడల నుంచే. భారత సేనల వ్యూహమేమిటో నిజాం సేనలకు అంతే పట్టలేదు. ఎర్రకోట మీద అసఫియా పతాకాన్ని ఎగరేస్తామని బోరవిరిచి బీరాలు పలికిన వారు కనీసం భారత సేనలను నిలువరించలేకపోయారు. ఎక్కడా పెద్ద ప్రతిఘటన లేదు. ఒక్క నల్‌దుర్గ్‌లో తప్ప. భారత సేనలు వెంటతెచ్చిన అధునాతన శకటాలూ యుద్ధవిమానాలూ నిజాం సైన్యాన్ని పూర్తిగా స్థైర్యం కోల్పోయేలా చేశాయి. చాలాచోట్ల నిజాం సైనికులు ఆయుధాల్ని పారేసి పారిపోయారు. కొన్నిచోట్లయితే వాళ్ల తికమకతో స్వపక్షంమీదే కాల్పులు జరుపుకున్నారు, ఫస్ట్‌ నిజాం ఇన్‌ఫాంట్రీ మీద ఘట్‌కేసర్‌ దగ్గర లెఫ్టినెంట్‌ అహ్మద్‌ అలీ ఇట్లా అయోమయంలో కాల్పులు సాగించాడు. పారిపోతున్నప్పుడు ఇన్నాళ్లూ హింసలకు గురైన పల్లెజనం నిజాం సైనికులను వెంటబడి తరిమారు. చాలాచోట్ల వాళ్లకి దేహశుద్ధి జరిగింది. మొదటిరోజు జరిగిన యుద్ధంలో ఏడుగురు భారత సైనికులు మరణించగా 632 మంది నిజాం సైనికులు వధించబడ్డారు. మొదటిరోజే నల్దుర్గ్‌ భారత సేనల వశమైంది, ఆ తర్వాత ఆదిలాబాద్‌, జల్కోట్‌లు భారత దళాల అధీనంలోకి వచ్చాయి. తల్మాడ్‌, తిరూరి ప్రాంతాలు సైతం భారత బలగాల పరమైనాయి. మునగాల మీద దాడి చేసినప్పుడు నిజాం సేన ప్రతిఘటించింది. అయితే అది ఎక్కువసేపు సాగలేదు. అదేరోజు ఉస్మానాబాద్‌ జిల్లాకి చెందిన తుల్జాపూర్‌, పర్బణీ జిల్లాకి చెందిన మానిక్‌ గఢ్‌, కనౌడ్‌గావ్‌, బెజవాడ వైపున్న బోనకల్లు భారత సేనల వశమమ్యాయి. ఆనాడే ఔరంగాబాద్‌లోని జాల్నా దారిన యూనియన్‌ బలగాలు ముందుకు సాగిపోయాయి. వరంగల్‌, బీదర్‌లలోని విమానాశ్రయాల మీద బాంబింగ్‌ జరిగింది. సైనికచర్య దృష్ట్యా హైదరాబాద్‌- బెజవాడ మధ్యనున్న ట్రంక్‌ టెలిఫోన్‌ తప్ప భారత్‌- హైదరాబాద్‌ మధ్యగల రాకపోకలనన్నిటినీ నిలిపివేశారు. రెండోరోజున సెప్టెంబర్‌ 14 నాడు దౌలతాబాద్‌, జాల్నా యూనియన్‌ పరమయ్యాయి. దాంతో ఔరంగాబాద్‌ తేలిగ్గానే చేజిక్కింది. చౌధరి నేతృత్వంలోని సేనలు పురోగమిస్తూ రాజేశ్వర్‌కి చేరాయి. అది సరిగ్గా షోలాపూర్‌- సికింద్రాబాద్‌ పట్టణాలకి మధ్యన ఉంటుంది. ఉస్మానాబాద్‌, నిర్మల్‌ చాలా తేలిగ్గా పట్టుబడ్డాయి. దక్షిణాన ఖాసిం రజ్వీ నేతృత్వంలోని రజాకార్ల ప్రతిఘటన స్వల్పంగానే ఉండింది. సికింద్రాబాద్‌ నుంచి 60 మైళ్ల దూరాన ఉన్న సూర్యాపేట దగ్గర భారత సేనలు ముందడుగు వేస్తున్నాయి. రెండోనాడు కూడా వరంగల్‌, బీదర్‌ విమానాశ్రయాలపై బాంబింగ్‌ జరిగింది. సెస్టెంబర్‌ 15 నాడు మూడోరోజున తెల్లవారుజామున 4 గంటలకి మురాద్‌లోని నిజాం సైన్యం లాతూర్‌ రోడ్డువైపు తిరోగమించింది. లాతూర్‌ నుంచి జహీరాబాద్‌కి రైల్లో బయలుదేరిన హైదరాబాద్‌ సెంకడ్‌ ఇన్ఫంటరీ సైనికులమీద విమానాల నుంచి బాంబులు కురిసాయి. దీంతో నిజాం సైన్యం ఉక్కిరిబిక్కిరయింది. చేసేదిలేక ఈ బ్యాటరీ సైనికులు రైలెక్కి హైదరాబాద్‌కి బయలుదేరారు. రైలు వికారాబాద్‌ స్టేషన్‌కి చేరగానే ఈ దళం వెంటనే జహీరాబాద్‌ తిరిగివెళ్లి అక్కడ యుద్ధం సంగతి చూడాలని ఆజ్ఞ వచ్చింది. అయితే ఈ దళం దగ్గర మరఫిరంగులు లేవు. వీళ్లంతా జహీరాబాద్‌కి వెళ్లి మాత్రం చేసేదేమిటి? వెళితే చావు తప్పదని తలచి హైదరాబాద్‌ ఆర్మీ హెడ్‌క్వార్టర్స్‌ ఆజ్ఞను ధిక్కరించి ఈ దళం హైదరాబాద్‌కే వెళ్లింది. వాయువ్యంలో ఔరంగాబాద్‌, షోలాపూర్‌- హైదరాబాద్‌ లైన్‌లోని హుమ్నాబాద్‌ యూనియన్‌ దళాల వశమయ్యాయి. జాల్నా నుంచి దక్షిణాన 40 మైళ్ల దూరాన షాదన్‌ దగ్గర ఉన్న ఒక ముఖ్యమైన బ్రిడ్జీ కూడా భారత బలగాల పరమైంది. వరంగల్‌ జిల్లాలో అర్తర్భాగంగా ఉన్న ఖమ్మం సైతం భారత సేనల ఆధీనమైంది. బీదర్‌ విమానాశ్రయం మీద బాంబింగ్‌ జరిగింది. సెప్టెంబర్‌ 16నాడు నాల్గవ రోజు జహీరాబాద్‌ క్రాసింగ్‌ దగ్గరున్న రోడ్డును నిజాం సైన్యం పేల్చివేసింది. భారతదళాల ధాటిని తట్టుకోలేక అక్కడినుంచి తిరోగమిస్తూ నిజాం సైనికులు ఎఖ్‌లీ వంతెనను పేల్చివేశారు. అయితే సాపర్ల సహాయంతో ఈ వంతెనని తిరిగి యూనియన్‌ సైనికులు కట్టారు. అక్కడి నుంచి పురోగమిస్తూ ముఖ్య రైల్‌, రహదారి కూడలి అయిన జహీరాబాద్‌ టౌన్‌ను వశం చేసుకుంది. ఆరోజే పర్బణీ జిల్లాలోని హింగోలీ పట్టణంమీద దాడి జరిగింది. ఇటు సూర్యాపేట నుంచి యూనియన్‌ సైన్యం హైదరాబాద్‌ దారిన వస్తూ ఉంటే సూర్యాపేటకి నాలుగు మైళ్ల దూరాన మూసీ నదిపై ఉన్న వంతెనని నిజాం సైన్యం పేల్చివేసింది. అయితే, మద్రాసు సాపర్స్‌ సాయంతో భారత దళాలు బ్రిడ్జీని పునర్నిర్మించాయి. సుటెర్‌ దిశన మునీరాబాద్‌ రైల్స్స్టేషన్‌ను భారత బలగాలు తమ వశం చేసుకున్నాయి. అక్కడ భారత సేనలకు భారీఎత్తున ఆయుధాలూ మందుగుండు సామగ్రీ దొరికాయి. చాలామంది రజాకార్లూ చిక్కారు. సెప్టెంబర్‌ 17న ఐదవరోజు హైదరాబాద్‌ దళాలు భారతీయ సేనల్ని రానీయకుండా చేయటానికి పటన్‌చెరు దగ్గరి బ్రిడ్జీని పేల్చివేశాయి. రోడ్డుమీద పెద్ద ఎత్తున మందుపాతరలు పెట్టి గచ్చిబౌలి, లింగంపల్లి మధ్యకు చేరుకున్నాయి. మల్కాపూర్‌ దగ్గర కూడా మందుపాతరలు అమర్చారు. అదేరోజు సాయంత్రం 5 గంటలకు నిజాం యుద్ధవిరమణని ప్రకటించి యూనియన్‌ సేనలను సికింద్రాబాద్‌లోకి స్వేచ్ఛగా రావడానికి అనుమతించాడు. సెప్టెంబర్‌ 18నాడు సాయంత్రం 4 గంటలకు ప్రజలంతా హారతులిస్తూ విజయతిలకాలు దిద్దుతూ హర్షాతిరేకాన స్వాగతిస్తుండగా భారతసేనలు సికింద్రాబాద్‌లోకి అడుగుపెట్టాయి. మేజర్‌ జనరల్‌ చౌధరి ఎదుట నిజాం సైన్యాధ్యక్షుడు అహ్మద్‌ అల్‌ ఎడ్రూస్‌, నిజాం యువరాజు ఆజంజా అసఫియా పతాకాన్ని దింపి లాంఛనంగా లొంగిపోయి శరణువేడారు. ఇక్కడితో పోలీసుచర్య పూర్తయింది. మొత్తం అంతా కలిపి 108 గంటల్లోనే హైదరాబాద్‌ సంస్థానం యూనియన్‌ వశమైంది. హైదరాబాద్‌మీద దాడిచేస్తే మద్రాసు, కలకత్తా, బొంబాయి, ఢిల్లీ నగరాలపై బాంబుల వర్షం కురిపిస్తానన్న రజ్వీ తోకముడిచాడు. అతడి అనుచరులూ మద్దతుదారులూ పిక్కబలం చూపారు. పెద్ద రక్తపాతమేదీ లేకుండానే నిజాం రాజ్యం విముక్తమయింది.

రెండు వందల యేండ్ల చరిత్రపుటల
కప్పు కొనియున్న గాఢాంధకార మెల్ల
కొట్టుకొనిపోయె, తూరుపు మిట్టనుండి
పారి వచ్చిన వెలుతురు వాగులోన
మూడవ పాలు తెల్గు పటమున్‌ తన పాలికి కత్తిరించు కొ
న్నాడు కదా నిజాము నరనాధుడు మున్నొక- రెండు మూడు నూ
ర్లేడుల నాడు! వాడు తొలగించిన ఆంధ్ర మహాపతాక క్రీ
నీడలు నాగుపాములయి నేటికి కాటిడె వాని వంశమున్‌ (దాశరథి)

courtesy : telugupeople.com

'1969' పునరావృతమవుతుందా? -కట్టా శేఖర్‌రెడ్డి

తెలంగాణ ఉద్యమంలో తరచూ కొందరు '1969 పునరావృత్తం' గురించి మాట్లాడుతు న్నారు. ఆ ఉద్యమాన్ని దేనికి ప్రతీకగా పరిగణించి వారు ఈ వ్యాఖ్యలు చేస్తున్నారో తెలి యదు. భయపడేవారు, ఆందోళన పడేవారు మాత్రం ఆ ఉద్యమాన్ని హింసకు, విద్వేష పూరిత పరస్పర హననానికి ప్రతీకగా భావిస్తుంటారు. నిజానికి, ఆ ఉద్యమం కేవలం హింసకు ప్రతీక కాదు. అసలు ఆ ఉద్యమం దేనికి ప్రతీక? ఆ ఉద్యమం నుంచి నేర్చుకోవలసిన పాఠాలు ఏమిటి? 1969కి 2006కి ఉన్న పోలిక ఏమిటి? ఆ ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమకారులు నేర్చుకోవలసిందే ఎక్కువ. 1969 ఉద్యమం కనీవినీ ఎరుగని తెలంగాణ ప్రజల సంఘటిత శక్తి కి మాత్రమే కాదు, తెలంగాణ ప్రజలు దారుణంగా వంచనకు గురికావడానికి కూడా ప్రతీక. ఇందిరాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్‌ దాష్టీకానికి ప్రతీక. చెన్నారెడ్డి మోసానికి ప్రతీక. 350 మంది తెలంగాణ యువకుల బలిదానానికి ప్రతీక. సోదరుల వంటి తెలంగాణ, తెలంగాణేతర ప్రజల మధ్య రగిలిన విద్వేషాగ్నికి ప్రతీక. మొత్తంగా తెలంగాణ ప్రజల పరాజయానికి ప్రతీక. ఇందులో దేనిని పునరావృతం చేయాలనుకుంటున్నారు? తెలంగాణ ఉద్యమకారులు తెలిసే మాట్లాడుతున్నారా?

నిజానికి, నాటి పరిస్థితికి నేటి పరిస్థితికి సామ్యం లేదు. నాడు దేశ రాజకీయాలపై, కాంగ్రె స్‌పై ఇందిరాగాంధీది ఏకచ్ఛత్రాధిపత్యం. కేంద్రంలో ఆమె నాయకత్వానికి ఎదురు లేదు. ప్రతి పక్షాలు బలంగా లేవు. కాంగ్రెస్‌కు మరో ప్రత్యామ్నాయమే లేదు. అందుకే ఆ రోజు ఇందిరా గాంధీ ఏం నిర్ణయం తీసుకున్నా చెల్లిపోయింది. ఇప్పుడా పరిస్థితి లేదు. దేశ రాజకీయాలపై కాంగ్రెస్‌ గుత్తాధిపత్యం బద్దలయి చాలా కాలమయింది. సంకీర్ణ రాజకీయాల యుగం వచ్చే సింది. సోనియాగాంధీ ఇందిరాగాంధీ కాలేరు. అలా వ్యవహరించడం సాధ్యం కాదు. ఎందు కంటే సోనియాగాంధీ తన అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రాంతీయ పార్టీలపై ఆధారపడక తప్పని పరిస్థితి. ప్రతి పది లోక్‌సభ స్థానాలనూ జాగ్రత్తగా కాపాడుకోవలసిన పరిస్థితి. కేంద్రం లో పది పదిహేను లోక్‌సభ స్థానాలు ఉంటే, ఏ పనినయినా సాధించుకునే అవకాశం ఇప్పుడు ఉన్నది. ఇక తెలంగాణ విషయం. 1969లో తెలంగాణ ప్రజలు ఒంటరి వారు. చిన్నాచితక పార్టీలు కొన్ని మద్దతు ఇచ్చినా, వాటి ప్రభావం తక్కువ. ఇప్పుడు అలా కాదు, జాతీయ స్థాయి లో తెలంగాణ ఉద్యమానికి ప్రధాన ప్రతిపక్షమైన బిజెపితో పాటు అనేక రాజకీయ పక్షాలు మద్దతు ప్రకటించాయి. 20 రాజకీయ పక్షాలు లిఖితపూర్వకంగా లేఖలు రాశాయి. తీర్మానాల ద్వారానో, లేఖల ద్వారానో తెలంగాణకు మద్దతు ప్రకటించిన పార్టీల బలం 217 మంది. కాంగ్రెస్‌ కూడా చిన్న రాష్ట్రాలకు వ్యతిరేకం కాదని ఉత్తరాంచల్‌, చత్తీస్‌ఘడ్‌, జార్కండు రాష్ట్రాల ఏర్పాటుతో తేలిపోయింది. తెలంగాణకు అనుకూలంగా కాంగ్రెస్‌ నిర్ణయించుకుంటే పార్లమెం టులో మెజారిటీ సరిపోతుంది. తెలంగాణ కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు స్వయంగా తెలంగా ణ కావాలని పట్టుబడుతున్నారు. ఇంతటి అనుకూల పరిస్థితి 1969లో లేదు.

నాడు తెలంగాణ ఉద్యమంపై కాసు బ్రహ్మానందారెడ్డి ఉక్కుపాదం మోపారు. తీవ్రంగా అణచివేసే ప్రయత్నం చేశారు. ఉద్యమకారులను పిట్టలను కాల్చినట్టు కాల్చి చంపారు. అయి తే అప్పుడు తెలంగాణ ఉద్యమం గోడు జాతీయస్థాయిలో ఎవరికీ పట్టలేదు. ఉద్యమం హింసా రూపం తీసుకుంటే, దానిని అడ్డం పెట్టుకుని ఇప్పుడు కూడా ప్రభుత్వం అదే తరహా అణచివేత కు దిగే అవకాశం లేకపోలేదు. ఈ ప్రభుత్వం అవసరమైతే ముస్లింలను, లాండ్‌ మాఫియాను రెచ్చగొట్టి తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీసేందుకు ప్రయత్నించే అవకాశం ఉందని తెలంగాణ మేధావులు ముందుగానే అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పుడు తెలంగాణ సమస్య జాతి దృష్టిని ఆకర్షించిన సమస్య. నలుగురు మాజీ ప్రధానులతోపాటు పలు జాతీయ రాజకీయ పక్షాల మద్దతు ఉన్న నినాదం. అధికార యుపిఎలోనే అత్యధిక పక్షాలు తెలంగాణకు అను కూలంగా ఉన్నాయి. తెలంగాణ ఉద్యమకారులు ఇప్పుడు ఏకాకులు కాదు.

వామపక్షాలు 1969లో విశాలాంధ్ర నినాదంతో తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించాయి. వీధుల్లోకి వచ్చి పోరాటాలు చేశాయి. ఇప్పుడా పరిస్థితి లేదు. ఇప్పుడూ ఆ పార్టీలు విధాన పరంగా తెలంగాణను వ్యతిరేకిస్తున్నా, పార్లమెంటులో ఆ బిల్లును ప్రతిఘటించడానికి సిద్ధంగా లేవు. యాభైయ్యేళ్ల స్వాతంత్య్రం తర్వాతకూడా తెలంగాణ ఆశించిన ప్రగతిని సాధించలేక పోయిందని వామపక్షాలూ అంగీకరిస్తున్నాయి. తెలంగాణ వెనుకబాటుతనాన్ని గుర్తిస్తూనే, ప్రత్యేక ప్యాకేజీలు కోరుతున్నాయి. ఆ పార్టీలలో కూడా, ముఖ్యంగా తెలంగాణ జిల్లాల్లో ప్రత్యే క రాష్ట్ర వాదాన్ని ఆమోదించే వారి సంఖ్య పెరిగింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు తాము అడ్డం పడుతున్నామని కాంగ్రెస్‌ చెప్పడాన్ని వామపక్షాలు అంగీకరించడం లేదు. 'కాంగ్రెస్‌ మా భుజాలపై తుపాకిని పెట్టి టిఆర్‌ఎస్‌ను కాల్చాలని చూడడం సహించం' అని సిపిఎం నాయ కులు స్పష్టంగానే చెబుతున్నారు. అందువల్ల 1969నాటి వీధిపోరాటాలు పునరావృతమయ్యే పరిస్థితి ఇప్పుడు లేదు. అయితే తెలంగాణ ఉద్యమకారులు హింసాకాండకు దిగితే వామప క్షాలు ఇప్పుడుకూడా మౌనంగా ఉండకపోవచ్చు. ఉద్యమం శాంతియుతంగా జరిగినంత కాలం వారి నుంచి ప్రతిఘటన ఉండే అవకాశం లేదు.

వీటన్నింటికీ మించి తెలంగాణ ఉద్యమంలో ఈ సారి పరిపక్వత కనిపిస్తున్నది. ఉద్యమ కారుల్లో ఆవేశం కంటే ఆలోచన, విద్వేషం కంటే విచక్షణ కనిపిస్తున్నది. అప్పుడో ఇప్పుడో నరేంద్ర వంటి వారు ఆవేశపడుతున్నా, రక్తపాతం జరగకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించు కోవాలన్నది తమ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత చంద్రశేఖర్‌రావు పదేపదే చెబు తుండడం గమనించవలసిన అంశం. 'అన్నదమ్ముల్లా కలసి ఉన్నాం, అన్నదమ్ముల్లా విడి పోదాం' అన్న భావన ఉద్యమకారుల్లో కనిపిస్తున్నది. ఉధృతి పెరిగిన నదీ ప్రవాహాలు కట్టలు తెంచుకున్నట్టు, ఉద్యమాలు కూడా ఏదో ఒక దశలో కట్టలు తెంచుకుని అదుపు తప్పే అవకా శాలు ఉన్నప్పటికీ దాని విపరీత పర్యవసానాలు తెలిసిన తరం ఇప్పటి ఉద్యమంలో ఉండడం ఒకింత మేలు. ఏకారణం చేతనయినా ఈసారి హింసాకాండ ప్రబలితే పరిస్థితి ఎవరి చేతు ల్లోనూ ఉండదని, అన్నివైపులా అపారనష్టం ఉంటుందన్న గ్రహింపు అందరిలోనూ ఉంది. నిజానికి కోస్తా, రాయలసీమ ప్రజానీకంలో కూడా గతంలో వలె తెలంగాణ ఇవ్వకూడదన్న తెగింపు లేదు. నిరంతరం కలహాల సహవాసం కంటే ఏదో ఒకటి తేలిపోతేనే మంచిదన్న అభిప్రాయం చాలా మందిలో కనిపిస్తున్నది.

తెలంగాణ సమస్యను రాజకీయంగానే పరిష్కరించుకోవాలి. పార్లమెంటు ద్వారానే పరిష్క రించుకోవాలి. తెలంగాణలో ఇప్పుడు భద్రాచలం కాకుండా 15 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. పునర్విభజన తర్వాత ఇవి 17 అవుతాయి. సంకీర్ణ రాజకీయాల యుగంలో 17 స్థానాలతో ఏదైనా సాధించడం అసాధ్యం కాదు. ప్రత్యేక రాష్ట్రాన్ని కోరే శక్తులు ఈ స్థానాలలో విజయం సాధించగలిగితే, కేంద్రంలో నిర్ణయాలను ప్రభావితం చేయడం కష్టమూ కాదు. 1969 ఉద్య మం తెలంగాణ ప్రజల సంఘటిత శక్తికి ప్రతీక. నాడు తెలంగాణ ప్రజలు 11 లోక్‌సభ స్థానా లలో తెలంగాణ ప్రజాసమితి సభ్యులను గెలిపించి, తమ ప్రత్యేక రాష్ట్ర వాంఛను ప్రగాఢంగా చాటుకున్నారు. ఇప్పుడు కూడా తెలంగాణ ప్రజలు అటువంటి సంఘటిత శక్తినే ప్రదర్శిం చాలని కోరుకుంటే తప్పులేదు. అలనాటి విజయాలను పునరావృతం చేయాలనుకుంటే ఎవరికీ అభ్యంతరం ఉండనక్కరలేదు. అప్పట్లో ఇందిరాగాంధీ ఏకధ్రువ రాజకీయాల వల్ల తెలంగాణ ప్రజల తీర్పు ఉపయోగపడకపోయి ఉండవచ్చు. తెలంగాణ ప్రజలు 1969లో అంతటి ఘన విజయాన్ని సాధించీ ఘోరంగా అవమానింపబడ్డారు. అటు కాంగ్రెస్‌, ఇటు చెన్నారెడ్డి కలసి తెలంగాణ హృదయాన్ని ఛిద్రం చేశారు. ఆ విజయం పనికి రాలేదు. ఇప్పుడు పరిస్థితి మారి పోయింది. తెలంగాణ ప్రజలు రాజకీయాలను పక్కనబెట్టి ప్రత్యేక రాష్ట్రంకోసం ఒక్కటి కాగ లిగితే, అలనాటి సంఘటిత శక్తినే చాటగలిగితే తెలంగాణ ప్రజలు మరోసారి ఓడిపోయే అవ కాశాలు లేవు. మరోసారి అవమానానికి గురికావలసిన అవసరం ఉండదు. పునరావృతం కావలసింది నాటి సంఘబలమే, కాని విద్వేషాగ్ని కాదు, హింసాకాండ కాదు. ఇందుకు తెలం గాణ ప్రజల్లోనే రాజకీయ దృఢసంకల్పం ప్రబలాలి.
courtesy : andhrajyothy.com

జాగృతినుంచి విముక్తి దాకా - పేర్వారం జగన్నాథం

హైదరాబాదులో ఎనిమిదిన్నర దశాబ్దాల క్రితం జరిగిన ఒక సంఘ సంస్కరణ మహాసభకు కార్వే పండితుడు హాజరయ్యారు. సభలో ప్రసంగాలన్నీ ఉర్దూ, ఇంగ్లీషు, మరాఠీ భాషల్లోనే సాగుతూ వచ్చినాయి. ఆలంపల్లి వెంక ట రామారావు తెలుగులో ప్రసంగించడానికి ఉపక్రమించగా మహారాష్ట్రులు అడ్డు తగిలి ఆయన్ని మాట్లాడనివ్వలేదు. తెలుగు భాషకు జరిగిన ఈ అవమానాన్ని జీర్ణిం చుకోలేక అదే రాత్రి టేకుమాల రంగారావు గృహంలో కొందరు ప్రముఖులు మాడ పాటి హనుమంతరావు ఆధ్వర్యంలో సమావేశమై 'ఆంధ్ర జనసంఘం'ను స్థాపిం చారు. ఆంధ్రుల సాంస్క­ృతిక అభ్యున్నతికి పాటుపడే లక్ష్యంతో నియమావళి రూపొందించుకొని సభలూ, సమావేశాలూ జరుపుతూ వచ్చినారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణలో అక్కడక్కడా ఈ సంఘంకు శాఖలేర్పడి కార్యకమాలు నిర్వహిస్తూ వచ్చినాయి. ఐతే వీటన్నిటినీ క్రమబద్ధీకరించి సమన్వయ పరచడం కోసం 'ఆంధ్ర జన కేంద్ర సంఘం' ఏర్పడింది. దీనికి ఆలోచన, రూపకల్పన హనుమకొండలో జరిగింది. ఇంతకుముందున్న ఆశయ ఆదర్శాల్ని విస్తృతపరచి ఈ విధంగా నిర్వచిం చినారు: (అ) గ్రంథాల యాలను, పఠన మందిరాలను, పాఠశాలలను స్థాపించుట; (ఆ) విద్యార్థులకు సహాయము చేయుట; (ఇ) విద్వాంసులను గౌరవించుట; (ఈ) తాళపత్ర గ్రంథములను, శాసనముల ప్రతులను సంపాదించుట, పరిశీలించుట; (ఉ) కరపత్రములు, లఘు పుస్తకములు, ఉపన్యాసముల మూలమున విజ్ఞానమును వ్యాపింపజేయుట; (ఊ) ఆంధ్ర భాషా ప్రచారమునకై వలయు ప్రయత్నములు సలుపుట; (ఎ) వ్యాయామ ములను, కళలను ప్రోత్సాహపరచుట; (ఏ) అనాథలకు అత్యవసరమగు సహాయము చేయుట. నిజాం ప్రభువు 1921లోనే 'గస్తీ నిసాన్‌ తిర్పన్‌' అనే ఫర్మానాను జారీ చేసినాడు. దీని ప్రకారం సంస్థానంలో ఎక్కడ కూడ ఎటువంటి సభలు-అవి భాషా సంస్క­ృతులకు సంబంధించినవైనా సరే- ముందు అనుమతి లేకుండా జరుపరాదు. ఈ అనుమతి కోసం హైదరాబాద్‌లోని కార్యాల యాల చుట్టూ తిరగవలసి వచ్చేది. నిర్వాహకుల్ని అధికారులు ముప్పతిప్పలు పెట్టే వాళ్ళు. మాడపాటి వారు ఒకసారి గ్రంథాలయోద్యమ మహాసభకు అనుమతి విష యమై హోం శాఖామాత్యులు ట్రెంచ్‌ దొరను కలిస్తే 'గ్రంథాలయాలనే విప్లవకేంద్రా లంటూ' వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడట! సిరిసిల్లలో జరిగిన గ్రంథాలయ మహాస భలో పువ్వాడ వెంకటప్పయ్య అనే కార్యకర్త తెలుగు భాషాభివృద్ధి గురించి మాట్లా డుతుంటే సభలో ఉన్న తహసీల్దార్‌ కల్పించుకొని 'సర్కారీ రఫ్త్‌రాలన్నీ ఉర్దూలో సాగుతుంటే, చచ్చిపోయిన తెలుగును బయటకు లాగనవసరం లేదంటూ ఘాటు గా విమర్శించినాడట. ఆ రోజుల్లో పాఠశాల నుంచి విశ్వవిద్యాలయందాకా బోధన అంతా ఉర్దూలోనే సాగుతుండేది. ఇదంతా ఒక ఎత్తైతే పాలకొడేటి వెంకట రామశర్మ అనే ఆంధ్ర సోదరుడు ఈ సంఘ కార్యకలాపాలు రాజకీయ, మతపరమైన స్వభా వం కలిగినవని ఆరోపిస్తూ పత్రికల్లో వ్యాసాలు రాయడం మరీ ఘోరం. ఇవన్నీ ఆనాటి పరిస్థితుల కద్దం పట్టే సంఘటనలు. సంఘం కార్యక్రమాలన్నీ స్థానిక ప్రజ ల్లో నూతనోత్తేజం కల్పించడం వరకే పరిమితమై ఉండేవి. ఈ దశను దాటి మొత్తం తెలంగాణ ప్రజల్ని చైతన్యపరచి ఒకే ఉద్యమ వేదిక మీదికి చేర్చవలసిన అవసరాన్ని సంఘం నాయకులు గుర్తించినారు. ఆ క్రమంలో అక్కడక్కడా ఆంధ్ర మహాసభల్ని జరుపుతూ వచ్చినారు.

1937లో మందుముల నరసింగరావు అధ్యక్షతన నిజామాబాద్‌లో జరిగిన ఆరవ ఆంధ్ర మహాసభ రాజకీయ స్వభావాన్ని సంతరించుకున్నది. అదేమంటే- రాష్ట్రంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని నెలకొల్పాలంటూ తీర్మానించినారు. ఇది నిజాంకు ఆగ్రహం కలిగించే అంశం. ఆ పిదప అప్పటి అత్రాపుబల్దా జిల్లాలోని మల్కాపురంలో మందుముల రామచంద్రరావు అధ్యక్షతన 1940లో జరిగిన ఏడవ ఆంధ్ర మహాసభ లో అరముదం అయ్యంగార్‌ ప్రతిపాదించిన రాజకీయ సంస్కరణల్ని బహిష్కరించా లంటూ తీర్మానించడం సాహసోపేతమైన చర్య. బహిష్కరించడమంటే ప్రభుత్వాన్ని హెచ్చరించడమేనన్న మాట. ఆ నాటి పరిస్థితుల దృష్ట్యా ఇది తీవ్రమైన తీర్మానం. దీన్ని ప్రతిపాదించినవారు రావి నారాయణ రెడ్డి. 1938 నాటికి సంస్థానంలో రాజ కీయ వాతావరణం వేడెక్కుతూ వచ్చిం ది.ఎందుకంటే 1938లో స్వామి రామా నంద తీర్థ నాయకత్వాన స్టేట్‌ కాంగ్రెస్‌ అవతరించింది. వెంటనే నిజాం ప్రభు త్వం దాన్ని నిషేధించింది. నిషేధాన్ని వ్యతిరేకిస్తూ స్టేట్‌ కాంగ్రెస్‌ నాయకులు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. ఇదే సందర్భంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు హాస్టళ్ళలో 'వందేమా తరం' గీతాన్ని సామూహికంగా గానం చేసినారు. అందువల్ల విద్యార్థులందరినీ విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించినారు. ఈ పరిణామాలు చోటుచేసుకొంటున్న తరుణంలోనే 1939లో మార్క్సిస్టు భావాలు కల కొందరు యువకులు రావి నారా యణరెడ్డి నాయకత్వంలో కమ్యూనిస్టు పార్టీని స్థాపించినారు. అయినా వాళ్ళంతా ఆంధ్ర మహాసభలో కలసి పనిచేస్తుండే వాళ్ళు. భువనగిరిలో రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన 1944లో జరిగిన ఆంధ్ర మహాసభ ఆంధ్రోద్యమ చరిత్రలో కొత్త అధ్యా యాన్ని ప్రారంభించింది. ఇక్కడే ఆంధ్ర మహాసభ రెండుగా చీలింది. మితవాదుల (మాడపాటి హనుమంతరావు, మందుముల నర సింగరావు, పులిజాల రంగారావు, కొండా వెంకట రంగారెడ్డి తదితరులు)కూ, కమ్యూనిస్టులకూ పొసగలేదు. దీంతో మితవాదులు భువనగిరి సభల్ని బహిష్కరించి వెళ్ళిపోయినారు. నారాయణరెడ్డి తన అధ్యక్షోపన్యాసంలో రాష్ట్ర ప్రజలెదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక , రాజకీయ సమస్యల్ని లేవనెత్తినారు. ముఖ్యంగా రైతాంగ సమస్యల్ని, భూ సమస్యల్ని ప్రస్తావిం చి సామ్యవాద దృక్పథంతో కొత్త ఎజెండాను మహాసభ ముందుంచినారు. 1946లో 13వ ఆంధ్ర మహాసభను మితవాదులు జమలాపురంకేశవరావు అ«ధ్యక్షతన, కమ్యూ నిస్టులు బద్ధం ఎల్లారెడ్డి అధ్యక్షతన జరుపుకున్నారు. ఇంతటితో మాడపాటి హను మంతరావు నేతృత్వంలో సాగిన ఆంధ్రో ద్యమ శకం ముగిసింది. మితవాదులంతా స్టేట్‌ కాంగ్రెస్‌లో క్రియాశీల పాత్ర వహిస్తూ వచ్చినారు. అయితే కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభ పేరుతోనే ఇక్కడినుంచి కొత్త అధ్యాయాన్ని సృష్టించినారు.

కమ్యూనిస్టులు గ్రామగ్రామాన ఆంధ్ర మహాసభకు సభ్యుల్ని చేర్పించి గ్రామ శాఖల్ని ఏర్పాటు చేస్తూ దొరలు, దేశ్‌ముఖ్‌ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించినారు. ఆంధ్ర మహాసభ అన్నా కమ్యూనిస్టుపార్టీ అన్నా దాదాపు పర్యాయప దాలుగా మారాయి. ఆంధ్రోద్యమచరిత్రలో రెండో ఘట్టానికి రావి నారాయణ రెడ్డి నేతృత్వం వహించినారు. ప్రజలు నిత్యం దొరల వల్ల ఎదుర్కొంటున్న పలు సమస్య లపై తిరుగుబాటు చేయించినారు. అందువల్లనే వాళ్లు ఉత్సాహంగా ఆంధ్ర మహా సభ కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్లు. ప్రజల్లో చైతన్యం పెరిగి పెత్తందార్లను నిలదీసే స్థాయికి ఎదిగినారు. ఆంధ్ర మహాసభ సభ్యత్వం పుచ్చుకున్న వాణ్ణి చూసి గ్రామా ధికారులు భయపడే స్థితి ఏర్పడింది. ఇట్లా ఉద్యమాన్ని తీవ్రతరంచేసి కమ్యూ నిస్టులు, దొరలు, దేశ్‌ముఖ్‌ల భూము లను పేదలకు పంచడం ప్రారంభించి నారు. ఆ కార్యక్రమాలను ఆరుట్ల రామ చంద్రారెడ్డి, ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి, నల్లా నరసింహులు వంటి నాయకులు చురుకుగా నిర్వహించేవారు. కమ్యూనిస్టు పార్టీలో సాంస్క­ృతిక దళాలు కూడా ఏర్పడి జానపద కళారూపాలతో ప్రచారం సాగించేవి. సుద్దాల హనుమంతు, తిరు నగరి రామాంజనేయులు వంటివాళ్లు ఈ సాంస్క­ృతిక కార్యక్రమాల్ని చేపట్టే వాళ్లు. దొరలు, దేశ్‌ముఖ్‌లుకూడా వీటిని ప్రతి ఘటించేందుకు కొందరు గూండాల్ని పోషి స్తూ కమ్యూనిస్టుల పైకి ఉసికొల్పేవాళ్లు. ఈ క్రమంలో కడవెండిలో ఆంధ్ర మహాసభ ఊరేగింపుపై విస్నూరు దేశ్‌ముఖ్‌ గూండాలు తుపాకులుపేల్చడంతో దొడ్డికొము రయ్య అక్కడికక్కడే నేలకొరగినాడు. పాలకుర్తిలో చాకలి ఐలమ్మ సాహసోపేతంగా విస్నూర్‌ దొర గూండాల నెదరించి తన పంట పొలాల్ని దక్కించుకొంది. దొరల భూ ముల్ని, వాళ్ల ఆస్తుల్ని రక్షించడం కోసం, వాళ్ల జులుం నిరాఘాటంగా సాగడం కోసం నిజాం పోలీసులు తరచూ రంగ ప్రవేశం చేస్తుండేవాళ్ళు. అప్పుడు కమ్యూనిస్టులకు వాళ్లతో ఘర్షణ తప్పనిసరయ్యేది. ఇట్లా కమ్యూనిస్టుల పోరాటం క్రమంగా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పరిణమించింది. అందుకు రాష్ట్రంలో రాజకీయ వాతావ రణంకూడా అనుకూలంగా ఉండెను. 1947 ఆగస్టు15న భారతదేశం స్వతంత్ర మయింది. అయితే హైదరాబాద్‌ సంస్థానానికి నిజాం పాలన నుంచి విముక్తి లభించ లేదు. 1947 సెప్టెంబర్‌ 11న నిజాంపై సాయుధ పోరాటానికి కమ్యూనిస్టుపార్టీ పిలుపు నిచ్చింది. ఇక్కడినుంచి నిజాం ప్రభుత్వాన్ని కూల్చడమే ధ్యేయంగా తెలం గాణ రైతాంగ సాయుధ పోరాటం సాగింది. బహదూర్‌యార్‌ జంగ్‌ రాష్ట్రంలో హిం దువుల్ని ముస్లింలుగా మార్చే 'తబ్లిగ్‌' ఉద్యమాన్ని నడిపినాడు. అప్పుడు ఆర్యసమా జం రంగ ప్రవేశంచేసి ముస్లింలుగా మారినవాళ్లను శుద్ధి కార్యక్రమం ద్వారా మళ్లీ హిందువులుగా మార్చేవాళ్లు. ఆరోజుల్లో ముస్లింలు 'అనల్‌మాలిక్‌' అనే నినాదంతో తామే ప్రభువులమన్న భావంతో ఉండేవాళ్లు. జంగ్‌ హఠాన్మరణంతో ఖాసిం రజ్వీ తెరమీదికి వచ్చాడు. ఇతడు ఇంకొక అడుగు ముందుకువేసి కొందరు మతోన్మాద ముస్లింలను కూడగట్టుకొని 'రజాకార్‌' సాయుధ దండును తయారుచేసినాడు. హిం దువుల్ని అంతం చేయడమే ఈ దండు పరమావధిగా ఉండేది. రజాకార్లు, నిజాం పోలీసులు గ్రామాలపై పడి విచక్షణా రహితంగా ప్రజలను కాల్చివేశేవారు. స్త్రీలపై అత్యాచరాలు చేసేవారు. ఈ దుండగాలను కుర్రారం రామిరెడ్డి, రేణికుంట రామిరెడ్డి మొదలైనవారు వీరోచితంగా ఎదుర్కొని వీరమరణం పొందారు. సంస్థానంలో పరి ణామాలను గమనిస్తోన్న భారత ప్రభుత్వం ఎట్టకేలకు పోలీస్‌ చర్యకు పూనుకొంది. మేజర్‌ జనరల్‌ జయంతినాథ్‌ చౌదరి నేతృత్వంలో భారత సైన్యం 1948 సెప్టెంబర్‌ 13న హైదరాబాద్‌ను ముట్టడించింది. 17వ తేదీన నిజాం నవాబు భారత సైన్యానికి లొంగిపోయాడు. హైదరాబాద్‌ సంస్థానం భారత సమాఖ్యలో కలిసింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చరిత్రాత్మకమైనది. 4000 మంది బలిదానం చేశారు. ఈ పోరాటం తెలంగాణ ప్రజల్లో అపూర్వ ఆత్మ విశ్వాసాన్ని ప్రోది చేసింది. హైద రాబాద్‌ సంస్థాన విమోచన ప్రక్రియను వేగవంతం చేసింది. కాల్మొక్తా అన్న వాడల్లా కత్తి బట్టినాడు. బాంచన్‌ అన్న వాడల్లా బందూకు ధరించినాడు. అదొక తెలంగాణ ప్రజా ప్రభంజన ప్రస్థానం. ఈ పోరాటంలో అసువులు బాసిన అమరవీరులందరికీ జోహారులు.
వ్యాసకర్త తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్‌-చాన్స్‌లర్‌
courtesy : andhrajyothy.com