Sunday, September 17, 2006

జాగృతినుంచి విముక్తి దాకా - పేర్వారం జగన్నాథం

హైదరాబాదులో ఎనిమిదిన్నర దశాబ్దాల క్రితం జరిగిన ఒక సంఘ సంస్కరణ మహాసభకు కార్వే పండితుడు హాజరయ్యారు. సభలో ప్రసంగాలన్నీ ఉర్దూ, ఇంగ్లీషు, మరాఠీ భాషల్లోనే సాగుతూ వచ్చినాయి. ఆలంపల్లి వెంక ట రామారావు తెలుగులో ప్రసంగించడానికి ఉపక్రమించగా మహారాష్ట్రులు అడ్డు తగిలి ఆయన్ని మాట్లాడనివ్వలేదు. తెలుగు భాషకు జరిగిన ఈ అవమానాన్ని జీర్ణిం చుకోలేక అదే రాత్రి టేకుమాల రంగారావు గృహంలో కొందరు ప్రముఖులు మాడ పాటి హనుమంతరావు ఆధ్వర్యంలో సమావేశమై 'ఆంధ్ర జనసంఘం'ను స్థాపిం చారు. ఆంధ్రుల సాంస్క­ృతిక అభ్యున్నతికి పాటుపడే లక్ష్యంతో నియమావళి రూపొందించుకొని సభలూ, సమావేశాలూ జరుపుతూ వచ్చినారు. ఇదే స్ఫూర్తితో తెలంగాణలో అక్కడక్కడా ఈ సంఘంకు శాఖలేర్పడి కార్యకమాలు నిర్వహిస్తూ వచ్చినాయి. ఐతే వీటన్నిటినీ క్రమబద్ధీకరించి సమన్వయ పరచడం కోసం 'ఆంధ్ర జన కేంద్ర సంఘం' ఏర్పడింది. దీనికి ఆలోచన, రూపకల్పన హనుమకొండలో జరిగింది. ఇంతకుముందున్న ఆశయ ఆదర్శాల్ని విస్తృతపరచి ఈ విధంగా నిర్వచిం చినారు: (అ) గ్రంథాల యాలను, పఠన మందిరాలను, పాఠశాలలను స్థాపించుట; (ఆ) విద్యార్థులకు సహాయము చేయుట; (ఇ) విద్వాంసులను గౌరవించుట; (ఈ) తాళపత్ర గ్రంథములను, శాసనముల ప్రతులను సంపాదించుట, పరిశీలించుట; (ఉ) కరపత్రములు, లఘు పుస్తకములు, ఉపన్యాసముల మూలమున విజ్ఞానమును వ్యాపింపజేయుట; (ఊ) ఆంధ్ర భాషా ప్రచారమునకై వలయు ప్రయత్నములు సలుపుట; (ఎ) వ్యాయామ ములను, కళలను ప్రోత్సాహపరచుట; (ఏ) అనాథలకు అత్యవసరమగు సహాయము చేయుట. నిజాం ప్రభువు 1921లోనే 'గస్తీ నిసాన్‌ తిర్పన్‌' అనే ఫర్మానాను జారీ చేసినాడు. దీని ప్రకారం సంస్థానంలో ఎక్కడ కూడ ఎటువంటి సభలు-అవి భాషా సంస్క­ృతులకు సంబంధించినవైనా సరే- ముందు అనుమతి లేకుండా జరుపరాదు. ఈ అనుమతి కోసం హైదరాబాద్‌లోని కార్యాల యాల చుట్టూ తిరగవలసి వచ్చేది. నిర్వాహకుల్ని అధికారులు ముప్పతిప్పలు పెట్టే వాళ్ళు. మాడపాటి వారు ఒకసారి గ్రంథాలయోద్యమ మహాసభకు అనుమతి విష యమై హోం శాఖామాత్యులు ట్రెంచ్‌ దొరను కలిస్తే 'గ్రంథాలయాలనే విప్లవకేంద్రా లంటూ' వ్యంగ్యంగా వ్యాఖ్యానించాడట! సిరిసిల్లలో జరిగిన గ్రంథాలయ మహాస భలో పువ్వాడ వెంకటప్పయ్య అనే కార్యకర్త తెలుగు భాషాభివృద్ధి గురించి మాట్లా డుతుంటే సభలో ఉన్న తహసీల్దార్‌ కల్పించుకొని 'సర్కారీ రఫ్త్‌రాలన్నీ ఉర్దూలో సాగుతుంటే, చచ్చిపోయిన తెలుగును బయటకు లాగనవసరం లేదంటూ ఘాటు గా విమర్శించినాడట. ఆ రోజుల్లో పాఠశాల నుంచి విశ్వవిద్యాలయందాకా బోధన అంతా ఉర్దూలోనే సాగుతుండేది. ఇదంతా ఒక ఎత్తైతే పాలకొడేటి వెంకట రామశర్మ అనే ఆంధ్ర సోదరుడు ఈ సంఘ కార్యకలాపాలు రాజకీయ, మతపరమైన స్వభా వం కలిగినవని ఆరోపిస్తూ పత్రికల్లో వ్యాసాలు రాయడం మరీ ఘోరం. ఇవన్నీ ఆనాటి పరిస్థితుల కద్దం పట్టే సంఘటనలు. సంఘం కార్యక్రమాలన్నీ స్థానిక ప్రజ ల్లో నూతనోత్తేజం కల్పించడం వరకే పరిమితమై ఉండేవి. ఈ దశను దాటి మొత్తం తెలంగాణ ప్రజల్ని చైతన్యపరచి ఒకే ఉద్యమ వేదిక మీదికి చేర్చవలసిన అవసరాన్ని సంఘం నాయకులు గుర్తించినారు. ఆ క్రమంలో అక్కడక్కడా ఆంధ్ర మహాసభల్ని జరుపుతూ వచ్చినారు.

1937లో మందుముల నరసింగరావు అధ్యక్షతన నిజామాబాద్‌లో జరిగిన ఆరవ ఆంధ్ర మహాసభ రాజకీయ స్వభావాన్ని సంతరించుకున్నది. అదేమంటే- రాష్ట్రంలో బాధ్యతాయుత ప్రభుత్వాన్ని నెలకొల్పాలంటూ తీర్మానించినారు. ఇది నిజాంకు ఆగ్రహం కలిగించే అంశం. ఆ పిదప అప్పటి అత్రాపుబల్దా జిల్లాలోని మల్కాపురంలో మందుముల రామచంద్రరావు అధ్యక్షతన 1940లో జరిగిన ఏడవ ఆంధ్ర మహాసభ లో అరముదం అయ్యంగార్‌ ప్రతిపాదించిన రాజకీయ సంస్కరణల్ని బహిష్కరించా లంటూ తీర్మానించడం సాహసోపేతమైన చర్య. బహిష్కరించడమంటే ప్రభుత్వాన్ని హెచ్చరించడమేనన్న మాట. ఆ నాటి పరిస్థితుల దృష్ట్యా ఇది తీవ్రమైన తీర్మానం. దీన్ని ప్రతిపాదించినవారు రావి నారాయణ రెడ్డి. 1938 నాటికి సంస్థానంలో రాజ కీయ వాతావరణం వేడెక్కుతూ వచ్చిం ది.ఎందుకంటే 1938లో స్వామి రామా నంద తీర్థ నాయకత్వాన స్టేట్‌ కాంగ్రెస్‌ అవతరించింది. వెంటనే నిజాం ప్రభు త్వం దాన్ని నిషేధించింది. నిషేధాన్ని వ్యతిరేకిస్తూ స్టేట్‌ కాంగ్రెస్‌ నాయకులు సత్యాగ్రహాన్ని ప్రారంభించారు. ఇదే సందర్భంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు హాస్టళ్ళలో 'వందేమా తరం' గీతాన్ని సామూహికంగా గానం చేసినారు. అందువల్ల విద్యార్థులందరినీ విశ్వవిద్యాలయం నుంచి బహిష్కరించినారు. ఈ పరిణామాలు చోటుచేసుకొంటున్న తరుణంలోనే 1939లో మార్క్సిస్టు భావాలు కల కొందరు యువకులు రావి నారా యణరెడ్డి నాయకత్వంలో కమ్యూనిస్టు పార్టీని స్థాపించినారు. అయినా వాళ్ళంతా ఆంధ్ర మహాసభలో కలసి పనిచేస్తుండే వాళ్ళు. భువనగిరిలో రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన 1944లో జరిగిన ఆంధ్ర మహాసభ ఆంధ్రోద్యమ చరిత్రలో కొత్త అధ్యా యాన్ని ప్రారంభించింది. ఇక్కడే ఆంధ్ర మహాసభ రెండుగా చీలింది. మితవాదుల (మాడపాటి హనుమంతరావు, మందుముల నర సింగరావు, పులిజాల రంగారావు, కొండా వెంకట రంగారెడ్డి తదితరులు)కూ, కమ్యూనిస్టులకూ పొసగలేదు. దీంతో మితవాదులు భువనగిరి సభల్ని బహిష్కరించి వెళ్ళిపోయినారు. నారాయణరెడ్డి తన అధ్యక్షోపన్యాసంలో రాష్ట్ర ప్రజలెదుర్కొంటున్న ఆర్థిక, సామాజిక , రాజకీయ సమస్యల్ని లేవనెత్తినారు. ముఖ్యంగా రైతాంగ సమస్యల్ని, భూ సమస్యల్ని ప్రస్తావిం చి సామ్యవాద దృక్పథంతో కొత్త ఎజెండాను మహాసభ ముందుంచినారు. 1946లో 13వ ఆంధ్ర మహాసభను మితవాదులు జమలాపురంకేశవరావు అ«ధ్యక్షతన, కమ్యూ నిస్టులు బద్ధం ఎల్లారెడ్డి అధ్యక్షతన జరుపుకున్నారు. ఇంతటితో మాడపాటి హను మంతరావు నేతృత్వంలో సాగిన ఆంధ్రో ద్యమ శకం ముగిసింది. మితవాదులంతా స్టేట్‌ కాంగ్రెస్‌లో క్రియాశీల పాత్ర వహిస్తూ వచ్చినారు. అయితే కమ్యూనిస్టులు ఆంధ్ర మహాసభ పేరుతోనే ఇక్కడినుంచి కొత్త అధ్యాయాన్ని సృష్టించినారు.

కమ్యూనిస్టులు గ్రామగ్రామాన ఆంధ్ర మహాసభకు సభ్యుల్ని చేర్పించి గ్రామ శాఖల్ని ఏర్పాటు చేస్తూ దొరలు, దేశ్‌ముఖ్‌ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాటం సాగించినారు. ఆంధ్ర మహాసభ అన్నా కమ్యూనిస్టుపార్టీ అన్నా దాదాపు పర్యాయప దాలుగా మారాయి. ఆంధ్రోద్యమచరిత్రలో రెండో ఘట్టానికి రావి నారాయణ రెడ్డి నేతృత్వం వహించినారు. ప్రజలు నిత్యం దొరల వల్ల ఎదుర్కొంటున్న పలు సమస్య లపై తిరుగుబాటు చేయించినారు. అందువల్లనే వాళ్లు ఉత్సాహంగా ఆంధ్ర మహా సభ కార్యక్రమాల్లో పాల్గొనేవాళ్లు. ప్రజల్లో చైతన్యం పెరిగి పెత్తందార్లను నిలదీసే స్థాయికి ఎదిగినారు. ఆంధ్ర మహాసభ సభ్యత్వం పుచ్చుకున్న వాణ్ణి చూసి గ్రామా ధికారులు భయపడే స్థితి ఏర్పడింది. ఇట్లా ఉద్యమాన్ని తీవ్రతరంచేసి కమ్యూ నిస్టులు, దొరలు, దేశ్‌ముఖ్‌ల భూము లను పేదలకు పంచడం ప్రారంభించి నారు. ఆ కార్యక్రమాలను ఆరుట్ల రామ చంద్రారెడ్డి, ఆరుట్ల లక్ష్మీనరసింహారెడ్డి, నల్లా నరసింహులు వంటి నాయకులు చురుకుగా నిర్వహించేవారు. కమ్యూనిస్టు పార్టీలో సాంస్క­ృతిక దళాలు కూడా ఏర్పడి జానపద కళారూపాలతో ప్రచారం సాగించేవి. సుద్దాల హనుమంతు, తిరు నగరి రామాంజనేయులు వంటివాళ్లు ఈ సాంస్క­ృతిక కార్యక్రమాల్ని చేపట్టే వాళ్లు. దొరలు, దేశ్‌ముఖ్‌లుకూడా వీటిని ప్రతి ఘటించేందుకు కొందరు గూండాల్ని పోషి స్తూ కమ్యూనిస్టుల పైకి ఉసికొల్పేవాళ్లు. ఈ క్రమంలో కడవెండిలో ఆంధ్ర మహాసభ ఊరేగింపుపై విస్నూరు దేశ్‌ముఖ్‌ గూండాలు తుపాకులుపేల్చడంతో దొడ్డికొము రయ్య అక్కడికక్కడే నేలకొరగినాడు. పాలకుర్తిలో చాకలి ఐలమ్మ సాహసోపేతంగా విస్నూర్‌ దొర గూండాల నెదరించి తన పంట పొలాల్ని దక్కించుకొంది. దొరల భూ ముల్ని, వాళ్ల ఆస్తుల్ని రక్షించడం కోసం, వాళ్ల జులుం నిరాఘాటంగా సాగడం కోసం నిజాం పోలీసులు తరచూ రంగ ప్రవేశం చేస్తుండేవాళ్ళు. అప్పుడు కమ్యూనిస్టులకు వాళ్లతో ఘర్షణ తప్పనిసరయ్యేది. ఇట్లా కమ్యూనిస్టుల పోరాటం క్రమంగా నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా పరిణమించింది. అందుకు రాష్ట్రంలో రాజకీయ వాతావ రణంకూడా అనుకూలంగా ఉండెను. 1947 ఆగస్టు15న భారతదేశం స్వతంత్ర మయింది. అయితే హైదరాబాద్‌ సంస్థానానికి నిజాం పాలన నుంచి విముక్తి లభించ లేదు. 1947 సెప్టెంబర్‌ 11న నిజాంపై సాయుధ పోరాటానికి కమ్యూనిస్టుపార్టీ పిలుపు నిచ్చింది. ఇక్కడినుంచి నిజాం ప్రభుత్వాన్ని కూల్చడమే ధ్యేయంగా తెలం గాణ రైతాంగ సాయుధ పోరాటం సాగింది. బహదూర్‌యార్‌ జంగ్‌ రాష్ట్రంలో హిం దువుల్ని ముస్లింలుగా మార్చే 'తబ్లిగ్‌' ఉద్యమాన్ని నడిపినాడు. అప్పుడు ఆర్యసమా జం రంగ ప్రవేశంచేసి ముస్లింలుగా మారినవాళ్లను శుద్ధి కార్యక్రమం ద్వారా మళ్లీ హిందువులుగా మార్చేవాళ్లు. ఆరోజుల్లో ముస్లింలు 'అనల్‌మాలిక్‌' అనే నినాదంతో తామే ప్రభువులమన్న భావంతో ఉండేవాళ్లు. జంగ్‌ హఠాన్మరణంతో ఖాసిం రజ్వీ తెరమీదికి వచ్చాడు. ఇతడు ఇంకొక అడుగు ముందుకువేసి కొందరు మతోన్మాద ముస్లింలను కూడగట్టుకొని 'రజాకార్‌' సాయుధ దండును తయారుచేసినాడు. హిం దువుల్ని అంతం చేయడమే ఈ దండు పరమావధిగా ఉండేది. రజాకార్లు, నిజాం పోలీసులు గ్రామాలపై పడి విచక్షణా రహితంగా ప్రజలను కాల్చివేశేవారు. స్త్రీలపై అత్యాచరాలు చేసేవారు. ఈ దుండగాలను కుర్రారం రామిరెడ్డి, రేణికుంట రామిరెడ్డి మొదలైనవారు వీరోచితంగా ఎదుర్కొని వీరమరణం పొందారు. సంస్థానంలో పరి ణామాలను గమనిస్తోన్న భారత ప్రభుత్వం ఎట్టకేలకు పోలీస్‌ చర్యకు పూనుకొంది. మేజర్‌ జనరల్‌ జయంతినాథ్‌ చౌదరి నేతృత్వంలో భారత సైన్యం 1948 సెప్టెంబర్‌ 13న హైదరాబాద్‌ను ముట్టడించింది. 17వ తేదీన నిజాం నవాబు భారత సైన్యానికి లొంగిపోయాడు. హైదరాబాద్‌ సంస్థానం భారత సమాఖ్యలో కలిసింది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చరిత్రాత్మకమైనది. 4000 మంది బలిదానం చేశారు. ఈ పోరాటం తెలంగాణ ప్రజల్లో అపూర్వ ఆత్మ విశ్వాసాన్ని ప్రోది చేసింది. హైద రాబాద్‌ సంస్థాన విమోచన ప్రక్రియను వేగవంతం చేసింది. కాల్మొక్తా అన్న వాడల్లా కత్తి బట్టినాడు. బాంచన్‌ అన్న వాడల్లా బందూకు ధరించినాడు. అదొక తెలంగాణ ప్రజా ప్రభంజన ప్రస్థానం. ఈ పోరాటంలో అసువులు బాసిన అమరవీరులందరికీ జోహారులు.
వ్యాసకర్త తెలుగు విశ్వవిద్యాలయం మాజీ వైస్‌-చాన్స్‌లర్‌
courtesy : andhrajyothy.com

No comments: